Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్ల స్థలాల పోరాటాలు ఉధృతం చేస్తాం
- పేదలకు ఎర్రజెండా అండగా ఉంటుంది
- నెల్లుట్లలో పేదలకు ఇండ్ల స్థలాలు దక్కేవరకు పోరాడుతాం
- ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య
- పేదల కుటుంబాలకు ధైర్యం చెప్పిన నాయకులు
నవతెలంగాణ విలేకరి- జనగామ
నిరుపేదల గూడు కోసం ఇండ్ల స్థలాల పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య అన్నారు. కొద్ది రోజుల కిందట జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ శివారులో వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర బృందం సోమవారం పరిశీలించింది. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సీఐటీయూ నాయకులు జయలక్ష్మి, మాధవితో కలిసి వీరయ్య పరిశీలించారు.
గుడిసెలు వేసుకున్న నిరుపేదలతో నాయకులు మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసు కున్నారు. వారికి ఎర్రజెండా అండగా ఉంటుందని ధైర్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరాజ్యం అధ్యక్షత నిర్వహించిన సభలో ఎస్.వీరయ్య మాట్లాడారు. రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎంతోమంది అవస్థలు పడుతు న్నారన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 44 పోరాట కేంద్రాల్లో 18 వేల మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని పోరాటం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇండ్ల స్థలాల భూపోరాటాలు ఇంతటితో ఆగేవి కావ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలందరికీ ఇండ్లస్థలాలు దక్కేవరకు కొట్లాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఇండ్లస్థలాలు సాధించుకునే వరకు పేదలు ఇక్కడే ఉంటారన్నారు. భూ కబ్జాదారులైనా, ప్రభుత్వం అయినా పేదల గూడుకు అడ్డం వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్నా పేదలకు కనీసం నిలువ నీడను కల్పించలేకపోయిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నేటికీ ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదన్నారు. ఇండ్ల స్థలాల కోసం నిరుపేదలు గుడిసెలు వేసి పోరాటాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం పోలీసులతో బెదిరింపులకు దిగుతుందన్నారు. ఖబర్దార్.. పోలీ సుల బెదిరింపులకు పేదల పోరాటాలు ఆగిపోవని హెచ్చరించారు. పేదలకు ఇండ్లు నిర్మించలేని ప్రభుత్వాలకు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తే అడ్డుకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అప్పగించాలని, అసంపూర్తిగా ఉన్న ఇండ్లను తక్షణమే నిర్మించి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు ఇండ్లస్థలాలు చూపించి వారు నిర్మించు కునేందుకు రూ.5 లక్షలు అందజేసి ఆదుకోవాలని కోరారు. లేకుంటే ఎర్రజెండా నీడలో గూడు లేని నిరుపేదలందరినీ ఐక్యం చేసి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయించి ఇండ్లస్థలాలు సాధించేవరకు పోరాటాలు నిర్వ హిస్తామని చెప్పారు. ఈ కార్య క్రమంలో ప్రజా సంఘాల నాయకులు పల్లెర్ల లలిత, దేవదానం, శంకరయ్య, చిరంజీవి, రమేష్, రాజేశ్వరి, నాగరాజు, రజిని తదితరులు పాల్గొన్నారు.
భూ పోరాట కేంద్రం సందర్శన
నవతెలంగాణ-భిక్కనూర్
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని మల్లు స్వరాజ్యం కాలనీలో నివాసం ఉంటున్న పేదలను ప్రజాసంఘాల ఐక్యవేదిక బృందం కలిసింది. వారితో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. రకరకాల ఇబ్బందులు.. రకరకాల సాకులతో పేదలకు ఇండ్ల స్థలాలు దక్కకుండా కుట్రలు చేస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బృందంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, భూ సాధన సమితి సభ్యులు అర్జున్ దేవరాజ్, చంద్రకళ, లక్ష్మీ సావిత్రి ఉన్నారు.