Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు తొలిసారి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
- ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్
- హాజరైన శాసన మండలి చైర్మెన్, అసెంబ్లీ స్పీకర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత తెలంగాణకు తొలిసారి విచ్చేసిన భారత ప్రథమ పౌరురాలు ద్రౌపతి ముర్ముకు సోమవారం ఘన స్వాగతం లభించింది. శీతాకాల విడిది నిమిత్తం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్... పుష్పగుచ్ఛమిచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్రపతి హెలికాప్టర్లో నేరుగా శ్రీశైలానికి బయల్దేరి వెళ్లారు. గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆమె వెంట ఉన్నారు. శ్రీశైలం చేరుకున్న ద్రౌపదీ ముర్ముకు ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి మల్లికార్జున స్వామివారి ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న రాష్ట్రపతి... 'ప్రసాద్' పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
శ్రీశైలంలో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత... ఆమె సైనిక హెలికాప్టర్లో నేరుగా హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ స్వాగత సత్కారాలు పూర్తయిన అనంతరం సైనిక వందనాన్ని స్వీకరించిన ద్రౌపతి ముర్ము... అక్కడి నుంచి బోల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఆమె అక్కడ ఈనెల 30 తేదీ వరకు బస చేయనున్నారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్‌తోపాటు ఇతర మంత్రులు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత కె.కేశవరావు, ఆ పార్టీ లోకసభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులున్నారు. వారందరినీ సీఎం కేసీఆర్ ఆమెకు పరిచయం చేశారు.