Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులర్పించిన సీపీఐ(ఎం) నాయకులు
- భౌతికాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగింత
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసర్ల కమలమ్మ(95) కన్నుమూశారు. నల్లగొండ పట్టణంలోని బాదేగూడెంలో ఉన్న ఆమె అనారోగ్యం, వయస్సు రీత్యా ఎదురయ్యే సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం రాత్రి మరణించారు. సీపీఐ(ఎం) నేతలు సోమవారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిజాం సైన్యాలకు, రజాకార్లకు ఆ తర్వాత నెహ్రూ సైన్యాలకు వ్యతిరేకంగా, నిర్బంధాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం లక్షలాది మంది ప్రజలు సాయుధ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. అలాంటి పోరాటం అమోఘమైన విజయాలను సాధించిందన్నారు. ఆ పోరాటంలో కమలమ్మ ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధులు కాసర్ల కమలమ్మ భౌతికకాయాన్ని సోమవారం ఆమె కుటుంబ సభ్యులు, కుమారుడు కాసర్ల గౌతంరెడ్డి, ఐఎంఏ జాతీయ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ పుల్లారావు ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మెడికల్ కాలేజీకి అప్పగించారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) నాయకులు పాలడుగు నాగార్జున, సయ్యద్ హశం, సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, పాలడుగు ప్రభావతి, తుమ్మల పద్మ, భూతం అరుణకుమారి, దండంపల్లి సరోజ తదితరులు ఉన్నారు.