Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన నందకుమార్‌ను చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో సోమవారం ఈడీ అధికారులు విచారించారు. దాదాపు ఐదు గంటల పాటు జైలులోని ప్రత్యేక గదిలో నందకుమార్‌ను అధికారులు ప్రశ్నించారు. కోర్టు రెండ్రోజుల పాటు ఇచ్చిన గడువును ఆసరాగా చేసుకొని మొదటి రోజు నందకుమార్‌ను పలు ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా, ఎమ్మెల్యేల కొనుగోలులో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? అందుకు ఏ మేరకు డబ్బులను ఆశ చూపారు? ఇందులో కీలకపాత్ర వహించిందెవరు? మొదలైన ప్రశ్నలను ఈడీ అధికారులు నందకుమార్‌కు వేసినట్టు తెలుస్తున్నది. అంతేగాక, బీఆర్ఎస్ తాండూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డితో తనకున్న సంబంధాలు ఎలాంటివి? వారి మధ్య ఉన్న లావాదేవీలు ఏమిటి? ఎన్నేండ్లుగా వారి పరిచయం ఉన్నది? అనే కోణంలో కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. దాదాపుగా అన్ని ప్రశ్నలకు నందకుమార్ నుండి సమాధానం రాబట్టినట్టు సమాచారం. కాగా, మంగళవారం రెండో రోజు కూడా ప్రశ్నించడానికి వస్తామని చెప్పి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తమ విచారణను ఈడీ అధికారులు ముగించినట్టు తెలిసింది. ఒక ఏఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈడీ అధికారులు నందకుమార్‌ను ప్రశ్నించారు.