Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోట్ పుస్తకాలు, స్టేషనరీ ఇవ్వండి
- సర్కారు బడులను దత్తత తీసుకోండి
- నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు
- ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులకు మంత్రి సబిత విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన సంవత్సరం-2023 సందర్భంగా తనను కలవటానికి వచ్చే వారు ఎవరు కూడా బొకేలు, శాలువలను తీసుకురావొద్దని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులను కలవటానికి వెళ్లేటప్పుడు కూడా ఇదే విధంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాంటి వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాటి స్థానంలో నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు, ఇతరత్రా వాటిని అందించాలని సూచించారు. రానున్న నూతన సంవత్సరం సందర్భంగా అందరూ ఒక కొత్త నిర్ణయం తీసుకుని అమలు చేయాలని కోరారు. జన్మదినాల సందర్భంగా ఇలాంటి సమాజ హిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని కోరారు. తనను కలిసేందుకు వచ్చే వారు ఈ దిశగా రానున్న జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఓ సరికొత్త విధానానికి నాంది పలుకలని కోరారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసు కొని ఆయా పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిన్న సహాయం పేద విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.