Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొందరి భావాలను అందరిపై రుద్దాలనే ప్రయత్నం
- ప్రజాగాయకుడు గద్దర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజ్యాంగం ప్రకారమే దేశం నడవాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.రాజ్యాంగాన్ని కాదంటూ కొందరి భావాలనే అందరిపై రుద్దాలనుకునే ఆలోచనలతో ప్రస్తుతం దేశంలో మతవిద్వేష పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైవిధ్యమున్న భారతదేశానికి సరిపడిన రాజ్యాంగం మనకున్నదని వివరించారు. 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను పురస్కరించుకుని సోమవారం తెలంగాణ నవల, కథ, కవిత్వంలో, మతసామరస్య భావనలు అనే అంశంపై సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. బుక్ ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, డాక్టర్ కొండా నాగేశ్వర్ (ఉస్మానియా యూనివర్సిటీ) చర్చాగోష్టిలో ప్రశ్నలు వేశారు. గద్దర్‌తో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, 1970లో తాను ఆలపించిన భారతదేశం భాగ్యసీమరా అనే పాట బాటలో సీఎం కేసీఆర్ నడుస్తున్నట్టు కనిపిస్తున్నదని తెలిపారు. సామ్రాజ్యవాదం మన మెదళ్లను పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్నదని చెప్పారు. మనదైన ఆలోచనలకు పుస్తకం అవసరమన్నారు. ప్రతి మార్పులోనూ అభివృద్ధి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ దేశంలో అందరిని కలపడానికి మళ్లీ ఉద్యమాలు వస్తున్నాయని చెప్పారు. ఆనంద్ మాట్లాడుతూ పుస్తకం అంతరిస్తున్న నేటి తరుణంలో కవులు, రచయితలు కళాశాలల వద్దకు వెళ్లాలని సూచించారు. సాంకేతికత మాయలో పడి సున్నితత్వం కోల్పుతున్నసమాజంలో విలువలను నెలకొల్పాల్సిన అవసరముందన్నారు. గుల్జార్ నదిపై పద్యాన్ని చదివి వినిపించారు.