Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాకింగ్ చేస్తుండగా కత్తులు, గొడ్డళ్లతో దాడి
- పరారీలో దుండగులు
నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. వాకింగ్ చేస్తుందగా దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రికి తరలి స్తుండగా మృతిచెందారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామానికి చెందిన శెట్టె మల్లేశం(43) గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రతి రోజూ ఉదయం వాకింగ్ చేస్తారు. సోమవారం తెల్లవారుజామున గుర్జకుంట గ్రామ శివారులోని బస్టాండ్ వైపు వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్ల్లతో మల్లేశం తలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చి పరారయ్యారు. రక్తపు మడుగులో కుప్పకూలిన మల్లేశంను గమనించిన స్థానికులు వెంటనే సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మల్లేశం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటనా స్థలాన్ని సీపీ ఎన్.శ్వేత, ఏసీపీ, సీఐ, ఎస్ఐ సందర్శించారు. ఈ మేరకు పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ మల్లేశంను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ చేర్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.