Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకాలతో సరదా సాయంత్రాలు...
- కదిలిన కుటుంబాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చిన్నా, పెద్దా తేడా లేకుండా సకుటుంబ సమేతంగా ప్రజలు అక్కడికి కదిలి వస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు తమకిష్టమైన పుస్తకాలను చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాయడం మొదలెట్టిన సాంఘిక సంక్షేమ గురుకల విద్యాలయాల విద్యార్థుల నుంచి రాయడంలో నిష్ణాతులైన రచయితల వరకు రాసిన పుస్తకాలన్ని ఒకే చోట ఉండటంతో భిన్న ఆసక్తులు ఆ వేదికలో వారిని కట్టిపడేస్తున్నాయి. అన్ని భాషలు, అన్ని రకాల అంశాలతో కూడిన పుస్తకాలు దొరుకుతున్నాయి. కుటుంబాలు, స్నేహితులు కలిసి, పాఠశాలల నుంచి విద్యార్థుల, ఉపాధ్యాయులతో కలిసి వచ్చి అక్కడ ఎంజారు చేస్తున్నారు. ఒకవైపు పుస్తకాలు కొనుక్కుంటూ మరో వైపు ఆయా రచయితలు, పుస్తకాల్లోని విషయాలను తెలుసుకుంటూ గడిపేస్తున్నారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ సమీపంలో గల ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 22న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన జనవరి ఒకటో తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగుతున్నది.
సమయం ముగిసినా ...కదలని జనం
ప్రతి రోజూ రాత్రి ఎనిమిది గంటల కల్లా పుస్తక మహౌత్సవ సమయం ముగిసిపోతున్నప్పటికీ ప్రజలు పుస్తకశాలల నుంచి కదలలేకపోతున్నారు. తాము విన్న, చదవాలనుకున్న పుస్తకాలన్ని ఒకే చోట ఉండటం వారిని కట్టి పడేస్తున్నాయి. ఆ అక్షరాలకు మంత్రముగ్ధులై సమయం దాటినా స్టాళ్లలోనే నిలబడిపోతున్నారు. అదే సమయంలో చిన్నారులు అదే ప్రాంగణంలో తమకిష్టమైన ఆటలాడుకుంటూ గడిపేస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ఎమర్జింగ్ రైటర్స్
మట్టిలో మాణిక్యం తదితర పుస్తకాలతో ఆ స్టాల్ నిండిపోయింది. అవి పేరుపొందిన రచయితలు రాసిన పుస్తకాలు కావు. అయినప్పటికీ ఆ స్టాల్ ప్రత్యేకంగా విద్యార్థులను ఆకర్షిస్తున్నది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు రాసిన ఆయా పుస్తకాలు విద్యార్థి లోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. సోమవారం స్టాల్ ను బీయస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సందర్శించారు.