Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్వయా సంస్థ వినూత్న ఆలోచన
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కన్నబిడ్డలు ఎక్కడో విదేశాల్లో ఉండి, ఇక్కడ ఒంటరితనం అనుభవిస్తున్న తల్లిదండ్రులకు, ఆ లోటు లేకుండా చూసుకొనేందుకు అన్వయ వృద్ధుల సంరక్షణ సంస్థ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వృద్ధుల్లో ఒంటరితనం లేకుండా, వారు సంతోషంగా గడిపేలా, అందర్నీ ఒకచోటకు చేర్చి, వారితో ఆడి, పాడి మరోసారి జీవితంలోని మాధుర్యాన్ని వారికి అందచేసే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా అన్వయ కేర్ మేనేజర్ జెనీబీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాప్యంలో ఒకే తరహా ఆలోచనలు కలిగిన వ్యక్తుల హాబీలను నెరవేర్చుకునేందుకు అన్వయా తోడ్పటును అందిస్తుందని ఆమె తెలిపారు. దానికోసం గోల్డెన్ డేస్ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబసభ్యులు తమ దగ్గర లేరనే ఆలోచన రాకుండా వృద్ధులతో మమేకమై వారితో కలిసి ఆడి, పాడుతూ సంతోషాలను పంచుకున్నారు. మరికొందరు వృద్ధ జంటలను గుడికి తీసుకువెళ్లడం, పిక్నిక్ పేరుతో పార్కులకు, సినిమాలు, షాపింగ్ మాల్స్, ఆర్ట్ గ్యాలరీలు మొదలైనవాటిని సందర్శించే అవకాశాన్ని కల్పించారు. దీనిపై అన్వయా కిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పలు అధ్యయనాల ప్రకారం వృద్ధుల్లో కేవలం 30 శాతం మందికి మాత్రమే ఆరోగ్య సంరక్షణ మద్దతు అవసరముందని తేలిందన్నారు. వారు తమ రోజువారీ కార్యక్రమాల్లో తోడు కావాలని కోరుకుంటున్నారనీ, అన్వయా కుటుంబం ఆ బాధ్యతలు నిర్వహిస్తుందని వివరించారు. తమ సంస్థ వృద్ధులకు అవసరమైన అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.