Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 డైరెక్టర్ స్థానాల్లో 14 కైవసం చేసుకున్న అధికారపార్టీ అభ్యర్థులు
- వేములవాడ రూరల్ స్థానానికి కొనసాగుతున్న రీ కౌంటింగ్
- పలుచోట్ల ఆందోళనలు.. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అధికారపార్టీకే ఓటర్ల మొగ్గు
- సాధారణ ఎన్నికలను తలపించిన సెస్ ఎలక్షన్స్
- 83వేల ఓట్లు ఉన్న సహకార విద్యుత్ సంస్థలో మెజార్టీని దక్కించుకున్న గులాబీ పార్టీ
నవ తెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / వేములవాడ
రాజన్నసిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సంస్థ (సెస్) డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాల్లో 14 కైవసం చేసుకోగా.. మరో స్థానానికి రీ కౌంటింగ్ చేపట్టడంతో ఫలితాల లెక్కింపు అర్ధరాత్రి వరకూ కొనసాగింది. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరగకపోయినా ఆయా రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. అయినప్పటికీ సునాయాసంగానే అధికారపార్టీ తాను బలపరించిన అభ్యర్థులను గెలిపించుకోవడంలో సఫలీకృతమైంది. స్వయంగా జిల్లా మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించి అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పేరుకు జిల్లాకే సెస్ పరిమితమైనా.. ఓటర్లు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండటం, అన్ని డైరెక్టర్ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే ఓట్లు రావడం అధికారపార్టీకి శుభసూచకంగా చెప్పవచ్చు.
సుదీర్ఘ చరిత్ర ఉన్న సెస్‌కు ఐదేండ్లకోమారు సాధారణ ఎన్నికల మాదిరిగానే డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఈసారి సెస్ ఎన్నికలు సాధారణ ఎన్నికలనే తలపించాయి. మొత్తం 13 మండలాల పరిధిలో 15 డైరెక్టర్ స్థానాలు ఉండగా.. సెస్ పరిధిలో 87,130 ఓట్లు ఉన్నాయి. జిల్లా పరిధిలోని ఇల్లంతకుంట మానకొండూర్ నియోజకవర్గంలో, బోయిన్పల్లి మండలం చొప్పదండి మండలంలో, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి మండలాలు వేములవాడ నియోజకర్గంలో ఉండటం, మిగిలిన మండలాలు సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో ఉండటం గమనార్హం. అధికారపార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ... తాను బలపరిచిన అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్లు దక్కలేదు. అయితే ఒకటి రెండు చోట్ల మాత్రం గట్టిపోటీనే ఇచ్చారు. చందుర్తి డైరెక్టర్ స్థానానికి సంబంధించి రెండు ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పొన్నాల శ్రీనివాసరావు గెలుపొందారు. 15 డైరెక్టర్ స్థానాల్లో ఒక దానికి రీకౌంటింగ్ సాగుతు న్నప్పటికీ.. మిగిలిన స్థానాలన్నీ క్లీన్‌స్వీప్ చేయడం బీఆర్ఎస్కు శుభసూచకంగా ఉందంటూ ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకంతో పాటు పట్టణ ప్రజల్లోనూ అధికారపార్టీ పట్ల ఆదరణ ఏమాత్రమూ తగ్గలేదని సంబురాలు చేసుకుంటున్నారు.
వేములవాడ రూరల్ స్థానంపై వీడని చిక్కుముడి
వేములవాడ టౌన్-1 నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ప్రత్యర్థిపై 700 ఓట్ల తేడాతో గెలుపుపొందారు. వేములవాడ టౌన్-2లోనూ అధికారపార్టీ అభ్యర్థి రేగులపాటి చరణ్‌రావు విజయం సాధించారు. అయితే, వేములవాడ సెగ్మెంట్లో రూరల్ స్థానం మాత్రం కీలకంగా మారింది. ఇక్కడ ఓట్ల లెక్కింపు సరిగా లేదని, తమ గెలుపు ఖాయమని తొలుత అధికారులు చెప్పి ఇప్పుడు మాట మార్చడమేంటని బీజేపీ బలపరిచిన అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ చేయాలని దరఖాస్తు చేయడంతో ఈ స్థానానికి పడిన ఓట్లను రాత్రి 7గంటల తరువాత మళ్లీ లెక్కింపు ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో ఒక్క స్థానమైనా దక్కించుకోకపోతామా? అన్న ఆశతో బీజేపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.
పలుచోట్ల ఆందోళనలు..
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట డైరెక్టర్ స్థానం ఫలితాల పట్ల బీఆర్ఎస్, బీజేపీ ఆందోళనకు దిగాయి. కొత్తపల్లి గ్రామ బ్యాలెట్ పెట్టెలకు సీల్ లేకపోవడంపై స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం చేశారు. ధర్నాకు దిగిన స్వతంత్ర అభ్యర్థిని, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్ ఓట్ల లెక్కింపులోనూ గందరగోళం చోటుచేసుకుంది. వేములవాడ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలుపొందినట్టు ప్రచారం అందుకుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజ్ విజయం సాధించినట్టు ప్రచారం జరగడంతో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య పరస్పర వాదోపవాదాలు జరిగాయి. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి ఆందోళనకారులను చెదదగొట్టారు. ప్రస్తుతం ఈ స్థానంలో రీకౌంటింగ్ నిర్వహించాలని బీజేపీ అభ్యర్థి దరఖాస్తు చేయడంతో ఓట్లను మళ్లీ లెక్కిస్తున్నారు.