Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీతో పోరాడే పార్టీలకు కమ్యూనిస్టుల మద్దతు
- 'మునుగోడు' ఫలితం కమ్యూనిస్టుల ప్రాధాన్యం చాటింది
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలి: మీడియాతో చిట్‌చాట్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీని ఓడించడమే కమ్యూనిస్టు పార్టీల ప్రధాన ఎజెండా.. దానిని బట్టే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీజేపీతో పోరాడే పార్టీలకు కమ్యూనిస్టుల మద్దతు ఉంటుందన్నారు. బీజేపీతో పోరాడినంత కాలం టీఆర్ఎస్కు మద్దతు ఉంటుందని చెప్పారు. ఖమ్మంలోని ఓ రెస్టారెంట్లో సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో తమ్మినేని మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్రంలో 9 నియోజకవర్గాలపై కేంద్రీకరించిందన్నారు. దీనిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే నాలుగు ఉన్నాయన్నారు. బీజేపీ ఒత్తిడి, బెదిరింపులకు తలొగ్గే కొందరు నేతలు పార్టీలు మారుతున్నారని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రై ఉండి 'సీట్లు ఎన్ని వచ్చినా అధికారం మాదే' అని అమిత్‌షా ప్రకటిస్తుండటం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం నిబద్ధత లేకుండా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలోనూ 20 సీట్లకుపైగా వస్తే అధికార పగ్గాలు బీజేపీ చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తమ్మినేని స్పందించారు. ఎన్ని సీట్లు వచ్చినా కావాల్సినంత మందిని కొనుగోలు చేసే శక్తి ఆ పార్టీ దగ్గర ఉందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితం కమ్యూనిస్టుల ప్రాధాన్యత చాటిందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేకున్నా.. బలమైన నేతలను ఆ పార్టీ వైపు లాక్కుని.. వారి బలాన్ని తమ బలంగా చూపుతోందన్నారు. మునుగోడులో బీజేపీకి లభించిన ఓట్లకన్నా రాజగోపాల్‌రెడ్డికి వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లే ఎక్కువన్నారు. కమ్యూనిస్టు పార్టీల్లో వ్యక్తిగత నిర్ణయాలుం డవని, పార్టీ నిర్ణయమే శిరోధార్యం అన్నారు. తాను పాలేరు నుంచో.. ఖమ్మం ఎంపీగానో పోటీ చేస్తున్నాననేది ప్రచారం మాత్రమేనని తెలిపారు. తాను ఏమి చేయాలనేది తమ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని అత్యంత వేగంగా వ్యాప్తి చేస్తోందని, దీనిని అడ్డుకునేందుకు కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక వ్యూహ రచనతో ముందుకెళ్తున్నాయన్నారు. లౌకిక తత్వం బలంగా ఉన్న ప్రాంతాల్లోనూ మతం సెంట్మెంట్ను పులుముతోందన్నారు. ఒకప్పుడు కులమతాలకతీతంగా వేడుకలు చేసిన చోట కూడా ఇప్పుడు బీజేపీ మతం చిచ్చు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడే పొత్తు లపై చర్చ అని, ఇప్పటి నుంచి దానిపై చర్చ అనవసరం అన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో తమ పంథా యథావిధిగా కొనసాగుతుందన్నారు.
వ్యకాస మహాసభను విజయవంతం చేయాలి
ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు ఖమ్మంలో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహా సభను విజయవంతం చేయాల్సిందిగా తమ్మినేని కోరారు. 29న నిర్వహించే బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరవుతున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు లక్ష మంది ప్రజానీకం హాజరవుతారని తమ అంచనా అన్నారు. సుమారు 25వేల మందితో పెవిలియన్ గ్రౌండ్ నుంచి బహిరం గసభా స్థలి ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానం వరకు సాయంత్రం 3 గంటలకు ప్రదర్శన ఉంటుందన్నారు. సభ ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మహాసభ, బహిరంగసభ విజయవంతానికి తోడ్పాటును అందించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ చిట్‌చాట్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, వై.విక్రమ్ పాల్గొన్నారు.