Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదేశంలో సమర్థవంతంగా ఆరోగ్య సేవలు
- ఎస్వీకే వెబినార్‌లో ఐటీ ప్రొఫెషనల్ వై కిరణ్‌చంద్ర
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మరోసారి చైనాలో కోవిడ్ వ్యాప్తి జరిగి, ప్రజలు పెద్దఎత్తున చనిపోతున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఐటీ ప్రొఫెషనల్ వై కిరణ్‌చంద్ర చెప్పారు. సుందరయ్య విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో 'చైనాలో ఏం జరుగుతుంది?' అంశంపై జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞానకేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కిరణ్‌చంద్ర మాట్లాడుతూ... కోవిడ్‌కు ముందు, ఆ తర్వాత తాను ఆదేశంలో పర్యటించి వచ్చాననీ, భారతదేశంతో పోలిస్తే, అక్కడి వైద్యసేవలు అత్యంత మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఒమైక్రాన్ వైరస్ రూపాంతరం చెంది చైనాలో వ్యాప్తి చెందిందనీ, భారతదేశంలో ఈ వైరస్ గతంలో ప్రతి ఇంటినీ తట్టిందని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన డెల్టా వేరియంట్‌తో పోలిస్తే, ఒమైక్రాన్ వ్యాప్తి, మరణాల సంఖ్య తక్కువని అన్నారు. చైనాలో డైనమిక్ జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేశాక, ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తిని ఆ దేశ శాస్త్రవేత్తలు ముందే అంచనా వేశారనీ, అయితే ప్రాణహాని లేనందున డైనమిక్ జీరో పాలసీని తెచ్చి, దానిలో ప్రజలు, ఆరోగ్యకార్యకర్తలు సహా అందర్నీ భాగస్వాముల్ని చేశారని వివరించారు. ప్రభుత్వం, ప్రజలు, స్థానిక ప్రభుత్వాలు కలిసి దీనిపై నిర్ణయం తీసుకున్నాయనీ, ఎక్కడన్నా తేడా వస్తే స్థానిక ప్రజాప్రతినిధుల్ని బాధ్యుల్ని చేస్తూ చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఒక కోవిడ్ కేసు వస్తే, రెండు లక్షల మందికి సమాచారం ఇస్తున్నారనీ, టెస్టింగ్ సెంటర్లు విస్త్రుతంగా పెట్టారనీ, టెస్టు శాంపిల్ ఇవ్వడానికి గరిష్టంగా ఏడు నిముషాలు పడుతుందనీ, నాలుగు గంటల్లో ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి ప్రజలు స్వచ్ఛందంగా టెస్టులు చేయించుకుంటున్నారనీ, ఆదేశంలో కోవిడ్ నిర్వహణ పూర్తి పారదర్శకంగా ఉందని చెప్పారు. రైల్వే, మెట్రో, విమానాలు సహా ఎలాంటి బహిరంగ ప్రదేశాల్లో తిరిగినా టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి అనీ, మనుషులతో సంబంధం లేకుండా అన్నిచోట్లా మిషన్ రెస్పాండ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో కూడా ఐసీయూ సెంటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ఒమైక్రాన్ వేరియంట్‌తో చైనాలో పెద్దఎత్తున ప్రజలు చనిపోతున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తొలి కథనం రాసిందనీ, ఆ వార్తకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఆ తర్వాత దాన్ని ఆధారం చేసుకొని, వివిధ దేశాల్లో చైనాపై దుష్ప్రచారం ప్రారంభించారని చెప్పారు. అమెరికాలో రోజుకు నాలుగువేల మరణాలు సంభవిస్తుంటే, దాన్ని 12 రెట్లకు ఊహాజనిత రెట్టింపు చేసి చైనాలో మరణాలను నిర్థారిస్తూ కథనాలు వండివార్చారని విమర్శించారు. అమెరికాలో రోజుకు 4వేల మంది చనిపోతుంటే, చైనా కంటే మనదగ్గర మరణాలు తక్కువ అని ప్రచారం చేసుకోవడానికి ఈ కథనాలను ప్రచారంలోకి తెచ్చిఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చైనాలో వాలంటీర్లు వ్యాక్సినేషన్‌ను ఇంటింటికీ తిరిగి ఇచ్చారని చెప్పారు. చైనాలో బేసిక్ మందులు కూడా అక్కడ దొరకట్లేదనే ప్రచారం హాస్యాస్పదమన్నారు. ఫ్లూ జ్వరం మందులపై కొన్ని అంక్షలు విధించారని తెలిపారు. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాడుతున్న డోలో 650 టాబ్లెట్లను ప్రపంచం మొత్తానికి సరఫరా చేస్తున్నది చైనానే అనీ, అలాంటి చోట మందులు లేవంటూ మీడియా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నదని విమర్శిం చారు. వూహాన్లో మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, వారంరోజుల్లో ఆస్పత్రికట్టి, ఆరోగ్య సేవల్ని ప్రజలకు అందించిన ఘనత అక్కడి ప్రభుత్వానిదనీ, అమెరికా, లండన్ వంటి దేశాల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుం టే, అక్కడి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారని అభిప్రాయపడ్డారు.