Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైౖతాంగ పోరాట స్ఫూర్తితో ముందడుగు
- 2016 వికలాంగుల చట్టం అమలు కోసం ఐక్య పోరాటం...
- వికలాంగుల కోటా పోస్టులన్నీ భర్తీ చేయాలి : ఎన్పీఆర్డీ బహిరంగ సభలో అఖిల భారత అధ్యక్షులు కాంతి గంగూలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) అఖిల భారత అధ్యక్షులు, పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మాజీ మంత్రి కాంతి గంగూలీ హెచ్చరించారు. ఎన్పీఆర్డీ అఖిల భారత మూడో మహాసభలు సోమవారం నుంచి హైదరాబాద్లో కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మహాసభలను పురస్కరించుకుని తొలి రోజు(సోమవారం) స్థానిక ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా 'జాలి, దయ, కరుణ మాకొద్దు..మా హక్కులు మాకు కావాలి, ఉరు వాంట్ జస్టిస్.. మోడీ ప్రభుత్వమా.. వికలాంగులపై నిర్లక్ష్యమా?' అంటూ వికలాంగులు నినదించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ అధ్యక్షతన జరగిన బహిరంగ సభలో గంగూలీ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన తెలంగాణ గడ్డపై వికలాంగుల జాతీయ మహాసభలు జరగడమంటే పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవటమేనని చెప్పారు. వికలాంగుల పట్ల పాలకుల నిర్లక్ష్యం మూలంగా వారి సంక్షేమం నడిరోడ్డులో పడిందని అన్నారు. కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేస్తూ.. వికలాంగులకు పెన్షన్ పెంచమంటే ప్రభుత్వాలు బీద అరుపులు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వికలాంగులు అత్యంత పేదరికంలో మగ్గుతున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. వారికి కొద్దిపాటి పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్క పెన్షన్ విధానాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని నిలదీశారు. వికలాంగుల హక్కుల సంరక్షణ కోసం ఉన్న చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల కోటా కింద ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. చట్టంలో ఉన్న అనేక సౌకర్యాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వికలాంగులను సమాజం చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల లెక్కల్లో కూడా గందరగోళం ఉందని చెప్పారు. అంగ వైకల్యం శాపం కాదన్నారు. అది ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. వారి శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఎన్పీఆర్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ వికలాంగుల చట్టాలు దేశంలో అమలు కావడం లేదని తెలిపారు. 2014నుంచి వారి హక్కులపై దాడి జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశ జనాభాలో 10నుంచి 15శాతం మంది వికలాంగులున్నారనీ, కేంద్రం మాత్రం వికలాంగుల జనాభాను తగ్గించి చూపిస్తున్నదని ఆరోపించారు. వారి సంక్షేమం కోసం ఐదు శాతం నిధులు ఖర్చు చేయాల్సిన ప్రభుత్వం.. 0.0097శాతం మాత్రమే ఖర్చు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 3.8శాతం మందికే కేంద్రం పెన్షన్ ఇస్తుందని అన్నారు వికలాంగులకు విద్యా అందని ద్రాక్షగా మారుతున్నదని చెప్పారు. నూతన్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.
సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మోహనన్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వికలాంగులను సమీకరించి సమీకరించి వారి హక్కులను సాధించుకుంటామని తెలిపారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య, హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల అధినేత ఉమర్ ఖాన్ మాట్లాడుతూ ధరల పెరుగుదలకనుగుణంగా పెన్షన్ను రూ.10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు బధిరులు విద్యకు దూరమవుతున్నారనీ, వారి కోసం సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయలను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు, రైల్వే, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు ఝాన్సీరాణి, కేంద్ర కమిటీ సభ్యులు సాయమ్మ, రాష్ట్ర నాయకులు అర్ వెంకటేష్, రాజు, మధుబాబు, దశరథ్, బలీశ్వర్, యశోద, గణేష్, అరిఫా, కషప్ప, శశికళ తదితరులు పాల్గొన్నారు.