Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో రోజువారీ కూలి రూ.826.. ఇక్కడ రూ.200 లోపే
- ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటం ఉధృతం
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో పోరాట కార్యాచరణ రూపొందిస్తాం
- రేపు ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ కార్మికులకు కూలి పెంచాలనీ, పేదలకు భూమి పంచాలనీ, ఉపాధి చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ బి.పద్మ డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్లస్థలాలు, భూ పోరాటాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను ఖమ్మంలో గురువారం నుంచి నిర్వహించబోయే తమ సంఘం రాష్ట్ర మూడో మహాసభలో రూపొందిస్తామని చెప్పారు. గురు వారం ఖమ్మంలో జరిగే బహిరంగసభకు కేరళ సీఎం పినరయి విజయన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారనీ, సభకు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతాయనుకున్న పేదలకు, కూలీలకు నిరాశే మిగిలిందన్నారు. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో కూలీలకు రోజువారీ కూలి రూ.826 దక్కుతుంటే మనరాష్ట్రంలో రూ.150 నుంచి 200 లోపే పడుతున్న పరిస్థితి ఉందని చెప్పారు. నూటికి 80 శాతం వ్యవసాయ కూలీలు మహిళలేనని చెప్పారు. పనిప్రదేశాల్లో మహిళలు శ్రమదోపిడీకి, సామాజిక అణచివేతకు గురవు తున్నారని వాపోయారు. కొన్ని చోట్ల లైంగిక దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి ఉందని వివరించారు. డ్వాక్రా మహిళలకు ఎక్కడా వడ్డీలేని రుణాలు అందట్లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీలకు కనీస వేతనం పడేలా జీవోలు జారీచేయడంతో పాటు దాన్ని పర్యవేక్షించే బాధ్యతను కార్మిక శాఖ విస్మరిస్తున్నదని విమర్శిం చారు. కూలిరేట్ల సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. భూ అభివృద్ధి పేరిట రియల్టర్లు, కాంట్రాక్టర్ల కోసం పేదల నుంచి అసైన్డ్ భూములను లాక్కోవడం చట్టవిరుద్ధమన్నారు. లావణీ పట్టాల భూములను అమ్ముకుంటే స్వాధీనం చేసుకుని తిరిగి ఆ పేదలకే అప్పగించాలనే నిబంధనకు పాలకులు తిలోదకాలిచ్చారన్నారు. నారాయణపేటలో అసైన్డ్ భూములను వెటర్నిటీ యూనివర్సిటీ కోసం లాక్కోవడం దారుణమన్నారు. లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో 174 ఎకరాల భూమి భూస్వాముల చేతుల్లో ఉందని చెప్పారు. వరంగల్లోని జక్కలొద్దిలో 250 ఎకరాలు, హన్మకొండలో ఎకరా 23 గుంటల భూమి ఆక్రమణలో ఉందన్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్టు ఎక్కడా అమలు కావడం లేదని చెప్పారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదల కు ఇండ్లు కట్టించేదాకా పోరాటం ఆపబోమని చెప్పారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం రాబోయే కాలంలో ప్రభుత్వానికి పేదల నుంచి దరఖాస్తులు పెట్టిస్తామన్నారు. జాగా లేని వారికి 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలనీ, ఇల్లు లేని ప్రతిపేదకూ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.