Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల పట్ల కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యం
- మా రాష్ట్రంలో వారి అభివృద్ధికి తగిన ప్రాముఖ్యత: ఎన్పీఆర్డీ జాతీయ సదస్సులో కేరళ రాష్ట్ర మంత్రి ఆర్ బిందు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలుకు నోచుకోవడం లేదనీ, వారి అభివృద్ధి, సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని కేరళ రాష్ట్ర ఉన్నత విద్య, సామాజిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు తెలిపారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) అఖిల భారత మూడో మహాసభల సందర్భంగా మంగళవారం ' విద్యా, ఉపాధి,ఆరోగ్యం,సంక్షేమం, సాధికారత' అంశాలపై సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య అధ్యక్షతన పోచంపల్లిలోని డాక్టర్ భారతీరావు రిహాబిలిటేషన్ సెంటర్ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా బిందు మాట్లాడుతూ పార్లమెంటులో 2016లోనే ఆమోదం పొందిన వికలాంగుల హక్కుల చట్టం నేటికీ అమలుకు నోచుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వానికీ, నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్పీఆర్డీ చేపట్టిన పలు ఉద్యమాల ఫలితంగా వికలాంగుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. యాక్సెస్బుల్ ఇండియా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం విషయంలో పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేస్తున్నదని విమర్శించారు. వికలాంగులు, వారి హక్కులు, వారికి కల్పించాల్సిన సదుపాయాలు తదితర అంశాలను 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. అంగవైకల్యం అనేది శాపం కాదన్నారు. కేవలం కుటుంబ సభ్యులు లేదా వారి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలనే ఆలోచనా ధోరణిని తప్పుబట్టారు. సమాజంలో వికలాంగులు కూడా ముఖ్యమైన భాగమనీ, వారి సంక్షేమం, అభ్యున్నతిని పౌర సమాజంతో పాటు ప్రభుత్వమే ప్రధాన బాధ్యతగా గుర్తించాలని చెప్పారు. వికలాంగులు చిన్నతనంలో పాఠశాలల్లో విద్య, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు పొందడం, గౌరవప్రదమైన జీవితం కొనసాగించడం వల్ల సమాజంలో అందరిలాగే అన్ని హక్కులు అనుభవించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. అయితే వికలాంగ చిన్నారులకు పాఠశాలల్లో తగు సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యా హక్కును కోల్పోతున్నారని చెప్పారు. సమ్మిళిత విద్య అత్యవసరమైనప్పటికీ, ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందించాలనే ఆలోచన సరైంది కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలోని లోపాలను సరి చేయకుండా నూతన విద్యా విధానం పేరిట సాంకేతికతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నదన్నారు. దేశంలో 60 శాతం పైబడి పాఠశాలలకు ఇప్పటికే విద్యుత్ సౌకర్యం లేదని తెలిపారు. అత్యధిక గ్రామీణ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేదనీ, ఎంతోమంది బడి పిల్లలకు వారి కుటుంబాలకు సరైన కంప్యూటర్లు గాని తదితర పరికరాలు గాని అందుబాటులో లేవని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కొద్ది మంది మాత్రమే అది కూడా ధనవంతులు మాత్రమే ఈ విద్యా విధానం వల్ల అంగవైకల్యంగల తమ పిల్లలకు చదువు చెప్పించగలుగుతారని గుర్తు చేశారు. ఇది సమ్మిళిత విద్య ఎంతమాత్రమూ కాదని చెప్పారు. 2007 అక్టోబర్ లో వికలాంగుల అంతర్జాతీయ కన్వెన్షన్ లో భాగంగా చేరిన మన భారతదేశం.. నేటికీ వికలాంగులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో, వారి పట్ల చూపే వివక్షను రూపుమాపే దిశలో ఇంకా చాలా వెనుకబడి ఉందని వివరించారు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్టుగా వికలాంగులకు మూడు రకాల అవరోధాలు ఉంటాయని తెలిపారు. భౌతికపరమైన శారీరక, మానసిక వైకల్యం, ఆర్థికపరమైన అవరోధం, సమాజం వారిపట్ల చూపించే దక్పథాలనేవి అవరోథాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడు రకాల అవరోధాలను, ఇతర అడ్డంకులను అధిగమించి, సమాజంలోని ప్రజలందరి లాగే జీవనం సాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలు రూపకల్పన చేయడంతో పాటు, పటిష్టమైన చట్టాలను అమలుపరిచే యంత్రాంగాన్ని నడిపించాలని సూచించారు. వికలాంగులకు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజా రవాణా, ప్రజా పంపిణీ వ్యవస్థలు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. వారికి ఆర్థిక చేయూతతో పాటు గౌరవంగా బ్రతికే విధంగా సమాన హక్కులను, అవకాశాలను కల్పించాలని స్పష్టం చేశారు.
వికలాంగులకు మేం ఎంతో భరోసానిచ్చాం..
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వికలాంగుల హక్కుల విషయంలో విఫలమవుతుంటే.. కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ దిశలో చాలా పురోగతిని సాధించిందని చెప్పారు. కోవిడ్ కాలంలో తీవ్ర సంక్షోభంగా మారిన వికలాంగుల జీవితాలకు తమ ప్రభుత్వం చక్కటి భరోసానిచ్చిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార పదార్థాలు అందించడం, వారి ఇంటి వద్దనే వివిధ థెరపీ సౌకర్యాలను కల్పించిందని చెప్పారు. అర్హులైన అందరికీ ఆర్థిక సహాయంతో పాటు ఉచిత వైద్యం అందించామన్నారు. సామాజిక వంటశాల ద్వారా భోజనం ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో సహాయ కార్యక్రమాలను చేపట్టి దేశానికి ఒక మార్గదర్శిగా నిలిచిందని స్పష్టం చేశారు. కేరళ సామాజిక భద్రత మిషన్ కింద ''అనుయాత్ర'' అనే పేరుతో గర్భ, పిండ దశ నుంచి చనిపోతే సమాధి సౌకర్యం వరకు అన్ని రకాల వికలాంగులకు వారి కుటుంబ సభ్యులకు సరైన చేయూతనిచ్చే విధంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు. బాలల సంరక్షణ కేంద్రాలు సమ్మిళిత విద్య, చిన్నతనంలోనే వైకల్య గుర్తింపు నిరోధక చర్యలు లాంటివి చేపట్టేందుకు ''అధి జీవనం'' అనే పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ''కైవల్య'' అనే పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం మొత్తం 7,749 మంది వికలాంగులకు రుణాలు అందించగా, అందులో 2,706 మంది మహిళలు ఉండడం గమనార్హమన్నారు. ''స్వాశ్రయ'' పథకం కింద 300 మంది ఒంటరి తల్లులకు, వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తుందని తెలిపారు. స్పీచ్, వినికిడి సమస్యలు గల విద్యార్థుల కోసం ఆరు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. నూతన సరళీకత ఆర్థిక విధానాల అమలు నేపథ్యంలో గత మూడు దశాబ్దాలుగా తీవ్ర అసమానతలకు కారణమవుతున్న ప్రభుత్వ విధానాలు వికలాంగులకు ఆశనిపాతంగా మారాయన్నారు. కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు ఉదారంగా అధిక సంఖ్యలో అధిక మొత్తంలో రాయితీలు అందిస్తున్న ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు వారిలో ముఖ్య భాగమైన వికలాంగుల జీవనానికై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం చాలా కింది స్థాయికి వెళుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమైన సామాజిక ఆర్థిక పరిపాలన వ్యవహారాలను, విషయాలను ప్రభుత్వాలు పట్టించుకో కుండా.. సున్నితమైన కుల,మత ప్రాంత వైరుధ్యాలను రెచ్చగొడుతున్నారనీ, ఈ ఉచ్చులో పడకుండా సమాజ పురోగతికి, సమాజంలోని అంతర్భాగమైన వికలాంగుల గౌరవప్రద జీవనానికి అవసరమైన అన్ని హక్కులను సాధించేందుకు సుదీర్ఘ సమైక్య పోరాటాలను చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సదస్సులో సంఘం అఖిల భారత అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు కాంతి గంగూలీ, మురళీధరన్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల చైర్మెన్ కెవీకే రావు, వ్యవస్థాపక అధ్యక్షులు కె నాగేందర్, టస్ప్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇమ్మత్ ఖాన్,ఇక్రిశాట్ శాస్త్ర వేత్త జానీల, ఎన్పీఆర్డీ అధ్యక్షులు కె వెంకట్ ప్రసంగించారు.