Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఆర్ఎస్ఐ) ప్రతి సంవత్సరం ప్రదానం చేసే వివిధ అవార్డుల్లో, మొదటిసారి ప్రకటించిన ప్రజాసంబంధాల జాతీయ విశిష్ట సేవ అవార్డు డీవీ సుబ్బారావుకు లభించింది. మంగళవారం భోపాల్లో జరిగిన 44వ అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సులో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభారు పటేల్ ఈ అవార్డును ఆయనకు అందచేశారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టరులో జీవితకాల సభ్యుడుగా ఉన్న సుబ్బారావు గడచిన 33 ఏండ్లలో వివిధ హౌదాల్లో పనిచేశారు. సింగరేణి ప్రజా సంబంధాల శాఖలో పీఆర్ఏ పనిచేసి 2016లో ఉద్యోగ విరమణ చేశారు. సింగరేణి కాలరీస్ ప్రజా సంబంధాల విభాగాభివద్ధిలో ఆయన ప్రాధాన భూమిక పోషించారు. ఆ సంస్థ కమ్యూనికేషన్ అధికారులకు, కోఆర్డినేటర్స్ కోసం పీఆర్ఎస్ఐ ద్వారా మూడుసార్లు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పీఆర్ఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ స్థానికంగా ఇచ్చే అనేక అవార్డులు సింగరేణికి లభించడంలో తనవంతుగా సింగరేణికి సేవలను అందించారు. సుబ్బారావుకు ఈ అవార్డు రావడంపట్ల సింగరేణి డైరెక్టర్ యస్.చంద్రశేఖర్, మాజీ డైరెక్టర్ దత్తాత్రేయులు, టీఎస్ జెన్కో డైరెక్టర్ (ఫైనాన్స్) డాక్టర్ టీఆర్కే రావు తదితరులు అభినందనలు తెలిపారు. ఆయన గతంలో 2012 నుంచి వరుసగా మూడుసార్లు జాతీయ ఉత్తమ కార్యదర్శి అవార్డును కూడా అందుకున్నారు.