Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యావ్యవస్థ రూపురేఖలు మారుస్తున్న 'మన ఊరు-మనబడి'
- దేశంలోనే అత్యధిక గురుకులాలున్న రాష్ట్రం తెలంగాణ
- 8 ఏండ్ల ప్రగతిప్రస్థానంలో ప్రభుత్వం వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన బడులకు ప్రయివేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. 2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది. లక్షకు పైచిలుకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారని వివరించింది. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నమోదు పెరిగిందని పేర్కొంది. 'ఎనిమిదేండ్ల ప్రగతి ప్రస్థానం దేశానికే ఒక ప్రగతి నమూనా'అనే పేరుతో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది. ఇందులో విద్యారంగానికి సంబంధించి పలు అంశాలను పొందుపర్చింది. 'దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాటశాలల్లో ఐదు లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన సాగుతున్నది. వాటిలో చదివే ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. అన్ని రకాల విద్యాలయాలు, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందజేస్తున్నది. మన ఊరు -మనబడి పథకం విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చనున్నది. రాష్ట్రంలోని పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.7,289 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధనను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 41,337 పాఠశాలల్లో 58,66,786 మంది పిల్లలు చదువుకుంటున్నారు. సర్వశిక్షా అభియాన్ కింద 44,588 పనులను చేపట్టి 38,182 పనులను పూర్తి చేసింది. 391 కేజీబీవీల్లో 72,824 మంది బాలికలు చదువుతున్నారు. వాటిలో వసతుల మెరుగు కోసం ప్రభుత్వం రూ.92.30 కోట్లు ఖర్చు చేస్తున్నది. 194 మోడల్ స్కూళ్లలో ప్రహరీగోడల కోసం రూ.78 కోట్లు ఖర్చు పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గుతూ విద్యాసంవత్సరం చివరి వరకు విద్యార్థులు కొనసాగడం పెరుగుతున్నదని సర్వశిక్షా అభియాన్ నివేదికలో తెలిపింది. మధ్యాహ్న భోజనం, సన్నబియ్యం, ఉచిత పుస్తకాలు, రెండు జతల యూనిఫారాల పంపిణీ, వంద శాతం మెస్‌చార్జీలు వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గి హాజరు శాతం పెరిగింది. మన ఊరు-మనబడి పథకంలో మొదటి దశలో 2021-22 విద్యాసంవత్సరంలో 9,123 (35 శాతం) పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,497.62 కోట్లు కేటాయించింది. వాటిలో 12,96,167 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 33 జిల్లాల కలెక్టర్లకు రూ.168 కోట్ల నిధులు విడుదల చేశాం.'అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.