Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాగా చదివి విషయావగాహన పెంచుకోవాలనీ, వచ్చే అవకాశాలను సద్వినియోగపర్చుకోవాలని విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని కేశవ్‌మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'హైదరాబాద్ విమోచన ఉద్యమం' అనే అంశంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి ప్రారంభించారు. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన రాంజీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమరం భీమ్, సురవరం ప్రతాప్ రెడ్డి, షోయబుల్లా ఖాన్లకు నివాళులర్పించారు. వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మనిషి ఎంత గొప్పస్థాయికి ఎదిగినా తన మూలాలు, సంస్కృతిని మరువొద్దని సూచించారు. ఒక జాతి నిర్మాణానికి విద్యనే పునాది అన్నారు. వ్యక్తి పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు కూడా విద్య కీలకమని చెప్పారు. హైదరాబాద్ విమోచన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు, మొత్తం దేశానికి ఎంతో ముఖ్యమైనదన్నారు. ఆ పోరాటంలో పాల్గొన్న వారి శౌర్యం, త్యాగం చిరస్మరణీయమన్నారు. మనం భవిష్యత్తులోకి వెళుతున్నప్పుడు, మన పూర్వీకులు వేసిన పునాదులపై మన దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేలా చూసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని నొక్కి చెప్పారు. కష్టపడి పనిచేయడం, మనం చేసే ప్రతిదానిలో శ్రేష్ఠత కోసం కృషిచేయాలని సూచించారు. మన సమాజం మెరుగుదలకు తోడ్పడటానికి సిద్ధంగా ఉండాలన్నారు. మన రాజ్యాంగం విలువలు, ఆదర్శాలను నిలబెడుతూ మరింత సమ్మిళితమైన, సమానమైన సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై పోరాడటం భవిష్యత్తు తరాల కోసం భూగోళాన్ని సంరక్షించడమేనని చెప్పారు. చదివే అలవాటు స్వీయ-అభివృద్ధికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటన్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో పుస్తకాలు చదవడం తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.