Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వైద్యంలో, వైద్య విద్యలో చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో సాధించిన ప్రగతి నమూనాను విడుదల చేసింది. గత ఎనిమిదేండ్లలో వైద్యం, వైద్యవిద్య కోసం పెట్టిన ఖర్చులు, దానితో లబ్దిపొందిన వారి గణాంకాలను వెల్లడించింది. తల్లి, బిడ్డల సంక్షేమం ప్రధానంగా దృష్టి సారించిన సర్కార్ కేసీఆర్ కిట్ ద్వారా 13,90,636 మందికి లబ్ది చేకూరింది. ఇందుకోసం రూ.1,261.67 కోట్లను ఖర్చు చేసింది. ఇటీవల రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించింది. దీంతో వెంటనే 1.25 లక్షల మంది గర్భిణులకు మేలు కలుగనున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 321 బస్తీ దవాఖానాల ద్వారా 2,11,23,408 మందికి చికిత్స అందించారు. ఇందుకోసం రూ.94.87 కోట్లను వెచ్చించారు. తెలంగాణ డయాగస్టిక్స్‌లో 17,17,835 మందికి 51,73,634 పరీక్షలను చేయగా రూ.125.8 కోట్లు ఖర్చయింది. ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై - ఆరోగ్యశ్రీ కన్వర్ట్ స్కీం కింద గరిష్ట కవరేజీ పరిమితి రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచారు. ఈజేహెచ్ఎస్ స్కీం కింద 3,52,603 మందికి చికిత్స కోసం రూ.1,422.09 కోట్లు ఖర్చు చేశారు. 67,049 మందికి రూ.698.08 కోట్లతో ఉచిత డయాలసిస్ సేవలనందించారు. రూ.160.19 ఖర్చు చేయగా అమ్మఒడి పథకం ద్వారా 22,19,504 మందికి మేలు కలిగింది. 108 సేవలను 38,31,195 మంది ఉపయోగించుకోగా రూ.558 కోట్లు వెచ్చించారు. రాష్ట్రంలో రెండు వేలకు పైగా దవాఖానాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కంటి వెలుగు పథకంలో భాగంగా 41.06 మందికి కండ్లద్దాలను అందజేశారు. కోవిడ్-19 తర్వాత రాష్ట్రంలో 26 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను నెలకొల్పారు. మరో ఎనిమిది ల్యాబ్‌లకు మంజూరునిచ్చారు.
వైద్యవిద్య
రాష్ట్రం ఏర్పడే నాటికి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలుండగా, ఎనిమిదేండ్లలో 12 మెడికల్ కాలేజీలు అదనంగా వచ్చాయి. మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. ఒక్కో మెడికల్ కాలేజీకి రూ.510 కోట్లు నిర్మాణ వ్యయం. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2,790, 24 ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 3,800 తో పాటు బీబీనగర్ ఎయిమ్స్‌లో 100, ఈఎస్ఐసీ కాలేజీలో మరో వంద కలుపుకుని మొత్తం 6,590 సీట్లున్నాయి. 14 నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి రూ.560 కోట్లను మంజూరు చేశారు. రూ.3,779 కోట్ల వ్యయంతో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మంజూరు కాగా వీటిలో ఒక హాస్పిటల్ పనులు పురోగతిలో ఉండగా, మరో మూడింటికి టెండర్లను ఆహ్వానించారు.
కార్డియాక్ రిహాబ్...
గుండెకు సంబంధించిన చికిత్సల విషయంలో కార్డియాక్ రిహాబ్ ఒక మైలు రాయి. దేశంలోనే తొలిసారిగా దీన్ని సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రిలో నెలకొల్పారు. డాక్టర్ మురళీధర్ నేతృత్వంలో ఇక్కడ సేవలందిస్తున్నారు. గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వారితో సహా గుండె సంబంధిత రుగ్మతలను ఎదుర్కొంటున్న వారికి ఇది వరంగా మారింది. గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ, రోగి వాడాల్సిన మందుల సంఖ్య తగ్గిస్తుండటం గమనార్హం.