Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన విద్యావిధానంలో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్లో ఆరు, ఏడు తరగతులకు చెందిన పాఠ్యపుస్తకాల్లో భగవద్గీతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేర్చాలన్న నిర్ణయం సరైంది కాదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్లో కొన్ని శ్లోకాలను, 11, 12 తరగతుల్లో సంస్కృతం పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చడమంటే విద్యను కాషాయికరణ చేయడమేనిని విమర్శించారు. విద్య అనేది సమాజానికి ఉపయోగపడి మానవ వనరులను అభివృద్ధి చేసేదిగా ఉండాలి తప్ప మతం పేరుతో సమాజాన్ని చీల్చేందుకు ఉపయోగపడకూడదని తెలిపారు. విద్యలో మత గ్రంథాలను తీసుకుని రావడమంటే రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
శాస్త్రీయ విద్యా విధానంతోనే శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతాయనీ, అంతే తప్ప మత గ్రంథాలు మూలంగా కాదని పేర్కొన్నారు.
పాఠశాల విద్యలో భగవధ్గీతను ప్రవేశ పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలనీ, శాస్త్రీయ విద్యను అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు విద్యారంగంలోకి తీసుకురాకుండా విద్యార్థులు పోరాడాలని వారు పిలుపునిచ్చారు.