Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది
- అన్నీ ఒకేసారి ఎలా వస్తాయి?
- పీఆర్సీపై ఎమ్డీ వీసీ సజ్జనార్
- 70 శాతం గ్రామాలకు బస్సులు తిప్పుతున్నాం: టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీకి వస్తున్న నష్టాలను గణనీయంగా తగ్గించి, ఆదాయాన్ని పెంచుతూ పురోభివృద్ధి వైపు పయనిస్తున్నామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ చెప్పారు. 2022 సంవత్సరంలో సంస్థలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొని, అమల్లోకి తేవడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని వివరించారు. మంగళవారంనాడిక్కడి బస్‌భవన్ ప్రాంగణంలో 'సింగరేణి దర్శిని' యాత్రా బస్సును వారు ప్రారంభించారు. ప్రతి శనివారం ఈ బస్సు సింగరేణి బొగ్గు గనుల సందర్శనకు యాత్రీకులను తీసుకెళ్తుందని చెప్పారు. అనంతరం 2022 వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ 11 రీజియన్లు, 99 డిపోలు, 364 బస్టేషన్లు, 44,648 మంది ఉద్యోగులతో 9,106 బస్సులను రోజుకు 3,021 రూట్లలో 31.82 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతున్నదని వివరించారు. 2020లో సంస్థ నష్టాలు 2,557.30 కోట్లు ఉండగా, 2022 డిసెంబర్ నాటికి వాటిని రూ.650.57 కోట్లకు తగ్గించామని తెలిపారు. బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య పెరిగి, టిక్కెట్ ఆదాయం పెరిగిందనీ, దానికితోడు తమ సిబ్బంది అంతర్గత సామర్ధ్యం కూడా పెంచుకుంటూ కిలోమీటర్‌కు రూ.40.06 పైసలు ఆదాయాన్ని (ఈపీకే) తెస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచడంతో ప్రజామోదంతోనే సెస్‌లు విధించాల్సి వచ్చిందన్నారు. గడచిన ఏడాది కాలంలో సంస్థ నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయన్నారు. కార్గో ద్వారా ఈ ఏడాది రూ.86.10 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రయాణీకుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఆర్టీసీలోని 25 డీజిల్ బస్సుల్ని ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రూ.16 కోట్లు కేటాయించామన్నారు. సంస్థ ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, తార్నకలోని ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్పు చేసి, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలు కూడా ఏర్పాటు చేశామన్నారు. గతంలో పండుగ సీజన్ వస్తే ఒకట్నిర రెట్లు టిక్కెట్ చార్జీలు పెంచేవారనీ, తాము ఆ విధానానికి స్వస్తి పలికి రెగ్యులర్ చార్జీలతోనే ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్నామన్నారు.
త్వరలో కాళేశ్వర దర్శిని బస్సులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, సమీప దేవాలయాలు, ఇన్‌టేక్ వాల్వుల సందర్శన కోసం త్వరలో కాళేశ్వరం దర్శిని బస్సుల్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. యాదగిరి గుట్టలో కింది నుంచి పైకి యాత్రీకులను ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్తున్నామనీ, ఆ ఖర్చును దేవస్థానం చెల్లిస్తున్నదని చెప్పారు. తిరుమలకు రోజుకు వెయ్యిమంది ప్రయాణీకులకు శీఘ్రదర్శనం టిక్కెట్లతో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.
కార్మికులకు...
సంస్థలోని కార్మికులకు పీఆర్సీ ఎందుకు ఇవ్వలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎండీ సజ్జనార్ స్పందిస్తూ...అన్నీ ఒకేసారి ఇవ్వలేమన్నారు. ఇప్పుడే వారికి ఐదు డిఏలు ఇచ్చామనీ, దానివల్ల వారికి నెలకు రూ.6 వేల నుంచి రూ.7వేల వరకు జీతం పెరిగి వస్తున్నదని తెలిపారు. సీసీఎస్ బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వలేదు. మెట్రోరైల్, ఎమ్ఎమ్టీఎస్, ఆర్టీసీ కాంబో టిక్కెట్‌పై పరిశీలన చేస్తున్నామనీ, ఇప్పటికే మెట్రోరైల్‌తో ఒప్పందం చేసుకున్నామని వివరించారు.
70 శాతం గ్రామాలకు బస్సులు
రాష్ట్రంలోని 70 నుంచి 80 శాతం గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్ని తిప్పుతున్నామని చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచీ దాదాపు 1,500 గ్రామాలకు బస్సులు వెళ్లట్లేదనీ, ఈ ఏడాదిలో ఆ గ్రామాల్లో ఎన్నింటికి బస్సులు తిప్పారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు. రోడ్లు బాగాలేని గ్రామాలకు బస్సులు తిప్పట్లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదనీ, పీఆర్సీ గురించి మాత్రమే ప్రస్తావించామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.