Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలుగులోని ఎలుకలు మెల్లగా బయటకొచ్చాయి : కిషన్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంబరాలు చేసుకున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసులోని స్వామీజీలతో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదన్నవారు ఇప్పుడెందుకు సంబరాలు చేసుకుంటున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న ఎలుకలు మెల్లగా బయటకు వచ్చాయనీ, దొంగలు తమ నిజమైన రంగుల్ని బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ కేసుతో సంబంధం లేదంటూ భుజాలు తడుముకున్నోళ్లు దొంగలను భుజాలపై మోస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు తమ జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకే కిషన్‌రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని విమర్శించారు. దొరికిన ముగ్గురికీ నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ పరీక్షలు చేస్తే.. బీజేపీతో వారికున్న సంబంధాలు బయటపడతాయని పేర్కొన్నారు. ఆ పరీక్షలకు సిద్ధమేనా..? అని కేటీఆర్ సవాల్ చేశారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీపై ప్రజాక్షేత్రంలో ఎప్పుడో విచారణ ప్రారంభమైందని హెచ్చరించారు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన తీరుకు బీజేపీ నిస్సిగ్గు ప్రకటనలు నిదర్శనం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకప్పుడు సీబీఐకి కేసు ఇస్తే నిందితులు భయపడే వారు.. ఇప్పుడు సీబీఐకి కేసును అప్పగిస్తే సంబరాలు చేసుకుంటున్నారంటే.. ఆ దర్యాప్తు సంస్థను బీజేపీ హయాంలో ఎంత నీరుగార్చారనే విషయం విదితమవుతున్నదని విమర్శించారు. ఆ పార్టీని కొత్తగా బద్నాం చేయాల్సిన ఖర్మ తమకు లేదనీ.. అధికార బలంలో ఏమైనా చేయొచ్చన్న కుటిల నీతితో ఎనిమిదిన్నరేళ్ల పాలనలో ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ ఎప్పుడో బద్నాం అయిపోయిందని విమర్శించారు.
బీజేపీ వద్ద సరుకు లేదు కాబట్టే.. ఎమ్మెల్యేలను అంగడి సరకులా కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసి... 'ఆపరేషన్ లోటస్' బెడిసి కొట్టటంతో బీజేపీ దొంగలు అడ్డంగా దొరికారంటూ ఆయన ఎద్దేవా చేశారు.