Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకుల నిర్లక్ష్య వైఖరిపై ఐక్య ఉద్యమాలు నిర్వహిద్దాం
- ప్రారంభ సభలో ఎన్పీఆర్డీ అధ్యక్షులు కాంతి గంగూలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్న ఎన్పీఆర్డీ, హక్కుల పరిరక్షణ కోసం అందరినీ ఐక్యం చేస్తున్నదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) అఖిల భారత అధ్యక్షులు, బెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి కాంతి గంగూలీ చెప్పారు. మంగళవారం దేశ్ముఖ్లోని డాక్టర్ మారుతీరావు రిహాబిలిటేషన్ సెంటర్లో ఆ సంఘం మహాసభ ప్రారంభ సూచకంగా పతాకాన్ని ఆయన ఎగరేశారు. అనంతరం ప్రారంభ సభలో మాట్లాడుతూ 1991 తర్వాత దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగమంతా ప్రయివేటు పరమైందని చెప్పారు. ప్రయివేటు రంగ సంస్థల్లో కూడా ఖచ్చితంగా వికలాంగులకు ఉద్యోగాలివ్వాలనే నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులు, అణచి వేతపై ఇతర సంఘాలతో కలిసి ఉద్యమాలను నిర్వహించాలన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలంటే..డబ్బులు లేవని పాలకులు బీద అరుపులు అరుస్తున్నారనీ, అదే కార్పొరేట్లకు, పెట్టుబడిదారీ కుబేరులకు మాత్రం లక్షల కోట్లు ఉదారంగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులను సమాజం నుంచి విడదీసి చూడొద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. వారు సమాజంలో భాగమేనని చెప్పారు. వికలత్వం ఏ దేవుడి శాపం కాదనీ, పౌష్టికాహారం సరైన సమయంలో తగిన రీతిలో అందకపోవటమే దీనికి కారణమన్నారు. దీనికి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని విమర్శించారు. హక్కులు సాధనకు ..పోరాటమే మార్గమన్నారు. అలాంటి అనుభవాలు ఎన్నో మన ముందున్నాయన్నారు. ఇటీవల కాలంలోనే మోడీ మెడలు వంచిన రైతాంగ పోరాటం మనకు స్ఫూర్తిగా ఉందని చెప్పారు. మహాసభలో జాతీయ స్థాయిలో పోరాటాలకు రూపకల్పన చేయాలన్నారు. పోరాటానికి సంఘీభావాన్ని కూడగట్టాలని సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే పోరాటాల్లో మనం కూడా భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సం రోజు నిర్వహించబోయే చలో ఢిల్లీ పోరాటంలో పాల్గొనాలన్నారు. ప్రారంభ సభకు అధ్యక్ష వర్గంగా ఎన్పీఆర్డీ ఉపాధ్యక్షులు ఝాన్సీ, మోహనన్, ప్రధాన కార్యదర్శి మురళీధరన్, అడివయ్య తదితరులు ఉన్నారు.