Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వైద్యవిద్య చరిత్రలో తొలిసారిగా...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. 8 లక్షల 78 వేల 280 ర్యాంకు వచ్చిన తెలంగాణ విద్యార్థికి స్వరాష్ట్రంలోనే ఎంబీబీఎస్ సీటు దక్కింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎనిమిది మెడికల్ కాలేజీలతో అదనంగా 1,150 సీట్లు అందుబాటులోకి రావడం, బీ కేటగిరీ సీట్లలో 85 శాతం స్థానికులకు కేటాయించడం, ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి 10 శాతానికి పెంచడం వంటి చర్యలతో ఈ సీట్లకు మార్కుల కటాఫ్ భారీగా తగ్గింది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో 42 మెడికల్ కాలేజీలు, 6,690 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. స్థానిక రిజర్వేషన్ లేకపోవడంతో గతేడాది బీ కేటగిరీలో 2,71,272 ర్యాంకు వరకు సీటొచ్చింది. ఈ ఏడాది రిజర్వేషన్ కల్పనతో 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థి సీటు దక్కించుకోగలిగారు. అదే విధంగా సీట్లు పెరగడంతో ఆయా కేటగిరీల్లో సీట్లు పొందేందుకు విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ఎస్టీల కేటగిరీలో గతేడాది 1,46,391 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు రాగా, రిజర్వేషన్లు 10 శాతం పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది 2,09,646 వరకు ర్యాంకులు పొందిన వారు ఎంబీబీఎస్ విద్యాభ్యాసం చేసేందుకు అర్హత పొందారు. సీ కేటగిరీలోనూ గతేడాది కన్నా సీట్లు పెరిగాయి. దీంతో గతంలో 9,23,789 ర్యాంకు వరకు కటాఫ్ ఉండగా, ఈ ఏడాది 10,55,181 వరకు అవకాశం లభించింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో జనాభాప్రాతిపదికన ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పీజీ సీట్ల విషయంలో రెండో స్థానంలో ఉన్నది.
ఆర్థికభారం నుంచి ఉపశమనం..మంత్రి హరీశ్ రావు
వైద్యవిద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దూరదేశాల్లో పరిచయం లేని భాషలో వైద్యవిద్యను అభ్యసించే కష్టం విద్యార్థుల నుంచి దూరమవుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తల్లిదండ్రులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తున్ననదని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని చేరువ చేశాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.