Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం గ్రామ పంచాయతీలకు సంబంధిత బిల్లుల చెల్లింపునకు అన్‌టైడ్ గ్రాంటులను వినియోగించవచ్చునని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామపంచాయతీలను బలోపేతం చేసేందుకు 15వ ఆర్ధిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటికి సమానమైన నిధులను గ్రామ పంచాయతీలకు రెగ్యులర్‌గా విడుదల చేసినట్టు పేర్కొన్నారు. 15వ ఆర్ధిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందనీ, వాటిని గ్రామ పంచాయతీ ఖాతాలకు రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేయదని స్పష్టంచేశారు. 15వ ఆర్ధిక సంఘం నుంచి టైడ్ కాంపోనెంట్‌ను పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చునని తెలిపారు. అలాగే అన్‌టైడ్ గ్రాంటులను గ్రామ పంచాయతీకి ఉన్న అధికారాల మేరకు ఖర్చు చేయవచ్చునని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు ఐఎఫ్ఎమ్ఐఎస్ పోర్టల్ ద్వారా నిర్ధిష్ట ఖర్చులను బుక్ చేశాయని వివరించారు. 15వ ఆర్ధిక సంఘం గ్రాంటులు విడుదలైన వెంటనే పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా పెండింగులో ఉన్న బిల్లుల చెల్లింపునకు బుక్ చేయాలని అన్ని గ్రామ పంచాయతీలకు సూచించినట్టు తెలిపారు. ఆ గ్రాంట్‌ను నిబంధనల ప్రకారం వినియోగిస్తామని పేర్కొన్నారు.