Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలను సంప్రదించాకే అమలు చేయాలి
- విద్యారంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
- ఏఐఎఫ్‌టీవో సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)-2020లో అనేక లోటుపాట్లున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే ఎన్ఈపీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ మండలి (ఏఐఎఫ్‌టీవో) సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ మనోధైర్యాన్ని నింపారని అన్నారు. సమాజంలో ఎవరికైనా ఆత్మవిశ్వాసమే వజ్రాయుధమనీ, దాన్ని నింపిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా అభివృద్ధిలో పురోగమిస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని వివరించారు. విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కనీ, విద్యా హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ ద్వారా అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఉపాధ్యాయులు నిరంతరంగా వారి సబ్జెక్టుల్లో పునఃశ్చరణ జరుపుకోవాలనీ, అప్పుడే ఆయా సబ్జెక్టుల్లో మరింత పట్టు సాధిస్తారని అన్నారు. అధ్యక్షత వహించిన ఏఐఎఫ్‌టీవో జాతీయ అధ్యక్షుడు అశ్వని కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టం కలిగిస్తున్న కాంట్రిట్యూరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసి ప్రతిపాదనలను కేంద్రానికి పంపినా ఉద్యోగులు, ప్రభుత్వం జమ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వడం సాధ్యం కాదంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పెన్షన్ రెగ్యులేటరీ చట్టంలో ప్రవేశించడమే తప్ప తిరిగి బయటికి వెళ్లే అవకాశం లేదనడం సరైంది కాదన్నారు. ఎన్ఈపీలో మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీవో సెక్రెటరీ జనరల్ చగన్‌లాల్ రోజ్, ఉపాధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.