Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే ఉన్నవి 2,938 బస్సులు
- ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో వచ్చేవి 3,360
- మొత్తం... 6,298
- ఆర్టీసీ బస్సులు 6,168 మాత్రమే : టీఎస్ఆర్టీసీ వార్షిక నివేదికలో చైర్మెన్, ఎమ్డీ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'విజయ పాలు' గుర్తున్నాయా? ఆర్టీసీకి పాలకు సంబంధం ఏంటని విస్తుపోకండి. ప్రభుత్వ సహకార రంగంలో తయారయ్యే విజయ డైరీ పాలు అరలీటరు ప్యాకెట్‌పై అర్థరూపాయి రేటు పెంచాలంటే తర్జన భర్జన పడేది. అప్పటికే ప్రయివేటురంగంలో ఉన్న డైరీ సంస్థలు 'విజయ' కంటే ఓ రూపాయి తక్కువకే పాలను ప్రజలకు అందించేవి. కాలక్రమేణా ప్రయివేటుకు చోటు కల్పించేందుకు 'విజయ' పాల ఉత్పత్తిని తగ్గించుకుంటూ వచ్చింది. ప్రయివేటు డైరీలు పెరిగాయి. ఇప్పుడు ధరను ప్రయివేటు డైరీలు నిర్ణయిస్తున్నాయి. నామమాత్రంగా మిగిలిన 'విజయ' ప్రయివేటు ధరలు పెరిగిన 15, 20 రోజుల తర్వాత తానూ రేట్లు పెంచుతున్నట్టు ప్రకటిస్తున్నది. గంపగుత్తాగా ఇప్పుడు పాల ఉత్పత్తి, ధర నిర్ణయం ప్రయివేటు డైరీ సిండికేట్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఇప్పుడు ఆర్టీసీ దగ్గరకు వద్దాం. ఆర్టీసీలో ప్రస్తుతం 6,168 బస్సులు (68 శాతం) ఉన్నాయి. అదే సంస్థలో 2,938 అద్దెబస్సులు (32 శాతం) ఉన్నాయి. టిక్కెట్ ధరను యాజమాన్యమే నిర్ణయిస్తున్నది. ఇప్పుడున్న అద్దె బస్సులకు అదనంగా, దశలవారీగా ఆర్టీసీలోకి 3,360 ఎలక్ట్రిక్ అద్దె బస్సుల్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ గణాంకాలను టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మంగళవారం జరిగిన 2022 వార్షిక విలేకరుల సమావేశంలో స్వయంగా ప్రకటించారు. అంటే 2025 నాటికి సంస్థలో అద్దె బస్సుల సంఖ్య మొత్తంగా 6,298కి (2,938ం3,360ొ6298) చేరుతుంది. ఇప్పుడున్న 32 శాతం అద్దెబస్సులు అప్పటికి 50.52 శాతానికి పెరుగుతాయి. ఆర్టీసీ బస్సులు 49.48 శాతానికి తగ్గుతాయి. ఇప్పుడు టిక్కెట్ ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఆర్టీసీ అసలు మనుగడలో ఉంటుందా? మరో 'విజయడైరీ' లెక్క తయారవుతుందా? అనేది ఇప్పుడున్న కోటి డాలర్ల ప్రశ్న! అసలు ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలను చంపేసి, ప్రయివేటురంగంలో కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వస్తున్నవేనని రవాణారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బస్సులు ఆర్టీసీలకు తెల్లఏనుగులుగా మారతాయనీ చెప్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల సాధ్యాసాధ్యాలపై (ఫీజిబిలిటీ) సర్వే చేశామనీ, ఆర్టీసీకి లాభమేనంటూ టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఉద్యోగాల కోత
ఆర్టీసీలో ఒక్క బస్సుపై ఆరుగురు ఉద్యోగులు పనిచేస్తారు. సంస్థలో 50 శాతానికి పైగా అద్దె బస్సులు వస్తే, ఆ మేరకు ఆర్టీసీ ఉద్యోగాల్లోనూ కోత పడుతుంది. సంస్థలోకి 6,298 అద్దె బస్సులు వస్తే, 37,788 ఉద్యోగాలకు కోత పడినట్టే. అద్దె బస్సుల నిర్వహణ, డ్రైవర్లు అంతా ప్రయివేటు వ్యక్తులే. వారికీ ఆర్టీసీకీ ఎలాంటి సంబంధం ఉండదు. అదే సమయంలో టీఎస్ఆర్టీసీలో ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 44,648 మంది. ఇప్పుడున్న 6,168 ఆర్టీసీ బస్సులతో పోలిస్తే 37,008 మంది ఉద్యోగులే అవసరం. అంటే యాజమాన్య లెక్కల ప్రకారం సంస్థలో 7,640 మంది ఉద్యోగులు అధికంగా ఉన్నట్టు. వారికోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) ఇప్పటికీ అమల్లోనే ఉండటం గమనార్హం.