Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈడీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఈడీ జాయింట్ డైరెక్టర్, ఈడీ డిప్యూటీ డైరెక్టర్(హైదరాబాద్), అసిస్టెంట్ డైరెక్టర్(హైదరాబాద్)లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ రిట్ పిటిషన్‌ను విచారణ చేయాలని బుధవారం రోహిత్‌రెడ్డి అడ్వకేట్ బుధవారం హైకోర్టును కోరే అవకాశం ఉంది. ఈడీ కేసును పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. ఈనెల 15న పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి తనకు సమన్లు ఇచ్చారని తెలిపారు ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాగంగానే ఈడీ అధికారులు ఈసీఐఆర్ 48/2022 నమోదు చేసిందన్నారు. ఇప్పటికే ఈ నెల 19, 20 తేదీల్లో తాను ఈడీ ఎదుట హాజరైనట్టు రోహిత్‌రెడ్డి తెలిపారు. తనపై ఉన్న కేసు ఏమిటని అడిగితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మనీలాండరింగ్ జరిగిందనీ, అక్రమంగా డబ్బు చేతులు మారాయని తమకు ఆధారాలు లభించాయని దర్యాప్తు అధికారి చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసును దెబ్బతీసేందుకే తనపై ఈడీ కేసు పెట్టిందనీ, ఆ కేసులో నిందితులతో తనకు వ్యతిరేకంగా ఈడీ చెప్పించే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తనను ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించిందన్నారు. ఇదే కేసులో అభిషేక్ అనే గుట్కా వ్యాపారికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించిందని తెలిపారు. ఎమ్మెల్యేల కేసు నిందితుడు నందకుమార్‌ను కూడా ఈడీ అధికారులు చంచల్‌గూడ జైల్లో ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో మనీలాండరింగ్ లేకుండానే ఈడీ అక్రమంగా తనపై కేసు నమోదు చేసిందని రిట్ పిటిషన్లో పేర్కొన్నారు.
మార్గదర్శిపై స్టే కొనసాగింపు
మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో ఏపీ రిజిస్ట్రేషన్ అధికారులు సోదాలు చేయరాదని గతంలోని స్టే ఉత్తర్వులను హైకోర్టు జనవరి 27 వరకు పొడిగించింది. ఏపీ అధికారుల సోదాల నోటీసులను మార్గదర్శి సవాల్ చేసింది. దీనినిలో స్టేను జనవరి 27వ తేదీ వరకు స్టే పొడిగిస్తున్నట్టు జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ వచ్చే నెల 27కి వాయిదా వేశారు.
చేతి పంపు మెకానిక్‌లను క్రమబద్ధీకరించండి
పంచాయతీరాజ్ శాఖలో 20 ఏండ్లుగా పనిచేస్తున్న చేతి పంపు మెకానిక్‌ల సర్వీస్‌లను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. దానికిగానూ రెండు నెలల గడువు ఇస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా చెప్పారు.
20 ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న తమ సర్వీస్‌లను రెగ్యులర్ చేయాలని కోరుతూ 34 మంది చేతి పంపు మెకానిక్‌లు వేసిన రిట్లను హైకోర్టు మంగళవారం విచారించింది. వారి అభ్యర్థనను ఆమోదిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.