Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంఘిక సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్
- హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సందర్శించిన మంత్రి
నవతెలంగాణ - అడిక్ మెట్
విద్యార్థులను ప్రోత్సహిస్తే రాబోవు తరానికి మంచి కవులు, రచయితలు అవుతారని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు రచించిన ఎనిమిది పుస్తకాలు నాట్యమయూరి, మదిలో నదిలా, చిన్ని తల్లి కోరిక, అనొఖే కిస్సే, మట్టిలో మాణిక్యం, స్వేచ్చ బింధువులు, ది అన్‌సీన్ రాబరీ, ఇరుకు సందుకు.. పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రచయితలు అంటే ఎక్కడ నుంచో వస్తారనే అపోహ ఉంటుందని, కానీ విద్యార్థులను ప్రోత్సహిస్తే వారిలో నుంచే కవులు, రచయితలు వస్తారని గురుకుల విద్యార్థులు నిరూపించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గురుకుల విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థల నుంచి యువ రచయితలు 17 పుస్తకాలు రాయడం ఒక విప్లవమేనన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమని చెప్పారు. రచయితలుగా విద్యార్థుల మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజానికి వీరు మంచి సందేశాన్ని అందించేందుకు చేస్తున్న ప్రయోగం చాలా బాగుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, బుక్ ఫెయిర్ అద్యక్షలు జూలూరి గౌరీశంకర్ పాల్గ్గొన్నారు.