Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారులకు రూ.32లక్షల కోట్ల రుణాలు రద్దు
- మహాసభ ఆహ్వానసంఘం అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పేద రైతులు, వ్యవసాయ కూలీలను లూటీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం రూ.లక్షల కోట్ల రుణమాఫీ చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ ఆహ్వానసంఘం అధ్యక్షులు యలమంచిలి రవీంద్రనాథ్, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. రిజర్వ్‌బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు రూ.32 లక్షల కోట్ల రుణాలను కార్పొరేట్లకు మాఫీ చేస్తే .. పేద రైతులకు పైసా రద్దు చేయలేదన్నారు. వ్యవసాయ కార్మికులు, పేద రైతుల సమస్యలపై చర్చించేందుకు 29-31వ తేదీ వరకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 29వ తేదీ సాయంత్రం ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగసభకు కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్ హాజరవుతున్నట్టు తెలిపారు. స్థానిక సుందరయ్య భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
29న బహిరంగసభకు లక్ష మంది ప్రజానీకం తరలిరానున్నట్టు తెలిపారు. పెవిలియన్‌గ్రౌండ్ నుంచి బహిరంగసభా స్థలి వరకు వేలాది మందితో ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రదర్శనలో మూడువేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాత్, రెండువేల మంది కళాకారులు పాల్గొంటారన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజరురాఘవన్, బి.వెంకట్ ఇతర నాయకులు పాల్గొంటారని తెలిపారు. వ్యవసాయ కూలీల పనికల్పనకు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చేలా కేంద్రం చర్యలు ఉన్నాయన్నారు. రోజుకు రూ.245 చొప్పున వందరోజులు మాత్రమే పని కల్పిస్తున్న కేంద్రం దీనిలోనూ అనేక ఆంక్షలు పెడుతోందని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఎస్లో 22% నిధుల కోత విధించినట్టు చెప్పారు. ఇప్పటికీ అనేక మందికి వ్యవసాయ కూలి లేక నగరాలు, పట్టణాలకు వచ్చి అడ్డాకూలీలుగా జీవనోపాధి పొందుతున్నారని, పనిదొరికితే సరే లేదంటే పస్తులుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ రోజువారీ వేతనం కేరళ రాష్ట్రంలో గరిష్టంగా రూ.291గా ఉందన్నారు. మన రాష్ట్రంలో క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యం రూ.2080గా ఉండగా కేరళలో ఈ ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.800 చెల్లిస్తున్నట్టు వివరించారు. వ్యవసాయ కూలీలు, రైతులకు అనేక వెసులుబాట్లు కల్పిస్తున్న ఆ రాష్ట్ర విధానాలను వివరించేందుకే కేరళ ముఖ్యమంత్రిని బహిరంగసభకు ఆహ్వానించినట్టు తెలిపారు. కార్పొరేట్లకు 25పైసల లోపు వడ్డీకి రుణాలిస్తున్న కేంద్రం.. రైతుల రుణాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రయివేటుగా నూటికి రూ.5కు వడ్డీకి తెచ్చుకుని రైతులు అవస్థపడుతున్నారన్నారు.
ఈ సమావేశంలో రైతుసంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వర్లు, విద్యావేత్త ఐవీ రమణారావు, సోషల్ మీడియా ఇన్చార్జి వై.విక్రమ్, పిట్టల రవి, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, యర్రా శ్రీకాంత్, ఐద్వా జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.