Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కళ చెదరని స్వప్నం' : ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కళ చెదరని స్వప్నం' అనే శీర్షికన ఇక్బాల్ రాసిన కవిత్వం ప్రస్తుత ఫాసిస్టు పరిస్థితుల్లో ప్రాణవాయువు లాంటిదని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. 35వ జాతీయ పుస్తక మహౌత్సవంలోని అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణం వద్ద పాలమూరు అధ్యయన వేదిక నాగర్కర్నూల్ జిల్లా కో ఆర్డినేటర్ ఎం.నారాయణ అధ్యక్షతన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ రాసిన 'కళ చెదరని స్వప్నం' పుస్తకాన్ని ప్రముఖ కవి కె.శివారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న హరగోపాల్ మాట్లాడుతూ రాజీలేనీ, సమాజం మారుతుందనే బలీయమైన విశ్వాసాన్ని ఆ కవిత్వం వ్యక్తం చేసిందన్నారు. అందరూ సమానంగా బతికే సమాజం వచ్చి తీరుతుందనే ఆశాభావాన్నిఅది కలిగిస్తుందన్నారు. రాజ్య స్వభావం, అణిచివేత, అణచివేత చట్టాలు, సమాజంలో వస్తున్న మార్పులు, రైతు ఉద్యమం, నక్సలైట్ పోరాటం తదితర అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఫాసిస్టు పరిస్థితులను చూసి భయపడే వారికి, ప్రజా పోరాటాల ముందు నియంతలు ఎక్కువ కాలం ఉండలేరనే సత్యాన్ని ఈ పుస్తకం గుర్తు చేస్తున్నదని చెప్పారు. తల్లిని, సమాజాన్ని, ఉద్యమాలను సమానంగా ప్రేమించిన కవి ఇక్బాల్ అని కొనియాడారు. కె.శివారెడ్డి మాట్లాడుతూ ఒక కవి ఎంత మేర, ఎంత బలంగా ప్రభావం చూపగలుగుతాడు? ఎంత మంది కవులను సృష్టించగలుగుతారనేది ఇక్బాల్ కవిత్వంతో తెలుస్తుందన్నారు. కవి స్కైబాబా మాట్లాడుతూ ఎన్ ఆర్సీ చట్టాలను కేంద్రం ఇంకా వెనక్కి తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికీ వాటి ప్రమాదం పొంచే ఉందని హెచ్చరించారు.
కవి ఇక్బాల్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో చోటు చేసుకున్న మానసిక, సమాజ సంక్షోభం నేపథ్యంలో కళ చెదరని స్వప్నం రాశానని తెలిపారు. విప్లవాలు వచ్చే కాలంలో వాటిని అడ్డుకునేందుకు సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా కరోనాను పెంచి పోషించారని విమర్శించారు. స్థానిక ప్రభుత్వాలతో చేతులు కలిపి పగలే చీకటన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఎక్కువ కాలం ఉండబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ కె.రాఘవాచారి, సభ్యులు కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.