Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ రెడ్డి కేసులో వాదనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈడీ దాఖలు చేసిన కేసును సవాల్ చేసిన రిట్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ నేత, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి చేసిన వినతిని హైకోర్టు తిరస్కరించింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న అభ్యర్థనతో ఆయన వేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. ఈడీ ఈ నెల 30వ తేదీన జరిపే విచారణకు రోహిత్‌రెడ్డి హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ సమన్లలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి ఐదో తేదీకి వాయిదా వేస్తూ బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ (పీఎంఎల్ఏ) చట్టం కింద ఈడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రోహిత్‌రెడ్డి వేసిన రిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి పార్టీ మారాలంటూ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు ఆఫర్ ఇచ్చారన్నారు. అయితే దీనిపై ఎలాంటి లావాదేవీలు జరగనప్పుడు ఈడీ కేసు నమోదు చెల్లదన్నారు. ఆర్థిక లావాదేవీలే జరగనప్పుడు.. పీఎంఎల్ఏ కేసు నమోదు చేయడం, ఈడీ విచారణ చేపట్టడం సరికాదన్నారు. ఈడీ పరిధి దాటి వ్యవహరించిందని చెప్పారు. వ్యక్తిగత, కుటుంబ, ప్రయివేట్ సమాచారాన్ని రాబట్టేందుకే ఈడీ విచారణ చేస్తోందనీ, దీన్ని అడ్డుకోవాలని కోరారు. ఈ కేసులో ఏదైనా చార్జీషీట్ దాఖలు చేయలేదని హైకోర్టు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దురుద్దేశపూర్వకంగా ఈడీతో రోహిత్‌రెడ్డిపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేయించిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలుకల్లా మారాయని చెప్పారు.
ఆయన తన వాదనలు కొనసాగిస్తూ.. 'వ్యక్తిగత సమాచారం. కుటుంబసభ్యుల సమాచారాన్ని రాబట్టేందుకే ఈడీ విచారణ చేస్తోంది. కుట్ర పూరితంగా దురుద్దేశంతో ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ కేసు నమోదు చేసిన ఈ నెల 15నే నోటీసు ఇచ్చింది. ఈ నెల 19న హాజరుకావాలని సమన్లు ఇచ్చింది. స్వామి అయ్యప్ప దీక్షలో ఉన్నందున ఈ నెల 31న దర్యాప్తునకు హాజరౌతాననీ, ఈలోగా ఏ సమాచారం కావాలో చెబితే ఇస్తానని లేఖ రాస్తే ఈడీ నిరాకరించింది. సమన్లకు అనుగుణంగా హాజరు కావాల్సిందేనని చెప్పింది. అందుకే ఈ నెల 19న ఈడీ ఎదుట హాజరయ్యాను. నన్ను దర్యాప్తు చేసిన అధికారికి బయట వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. బయట వ్యక్తుల సూచనలకు అనుగుణంగా ఈడీ దర్యాప్తు జరుగుతోంది. ఆ వ్యక్తుల సూచనల మేరకే ఈడీ ప్రశ్నలు వేసింది. ఈడీ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను రికార్డు చేయలేదు. ఈ నెల 20న పిటిషనర్ మళ్లీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు, ఏ కేసు నిమిత్తం దర్యాప్తు చేస్తున్నారో చెప్పకపోతే ఈడీ ప్రశ్నలకు జవాబు చెప్పనని తేల్చి చెప్పారు. దీంతో ఈడీ దర్యాప్తు అధికారి చాలా అయిష్టంగా మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల ఎర కేసులో పోలీసులు నమోదు చేసిన కేసని బదులిచ్చారు. మనీ లాండరింగ్‌కు ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధం లేదని చెప్పారు. ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందుకుమార్‌ను చంచల్‌గూడ జైల్లో ఈడీ ప్రశ్నించింది. వాళ్ల నుంచి తనకు వ్యతిరేకంగా వివరాలు రాబట్టి ఈడీ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. ఆ కేసులో ఫిర్యాదుదారుడినే ఈడీ నిందితుడిగా చేస్తూ కేసు నమోదు చేసింది. ఈ దారుణాన్ని అడ్డుకోవాలి..' అని నిరంజన్‌రెడ్డి వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. కౌంటర్ వేస్తామని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం విచారణను జనవరి 5కి వాయిదా వేసింది.