Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్రాన్ని కోరారు. బీజేపీ సర్కారు చివరిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో జీఎస్టీని రద్దు చేస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నేతన్నల సంక్షేమం, ఆ రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఆర్థిక మంత్రులు మారుతున్నా.... కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అందుతున్నది శూన్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, సిరిసిల్ల మెగా పవర్లూమ్ క్లస్టర్‌కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుకు నిధులివ్వాలనీ, తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటుపై ప్రకటన చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల లేమి, మౌలిక వసతుల కల్పన వైఫల్యంతో మేక్ ఇన్ ఇండియా కేవలం నినాదంగా మాత్రమే మిగిలిపోయిందని విమర్శించారు. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాలతోనూ పోటీ పడలేని పరిస్థితిలో భారతదేశం ఉండడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్స్టైల్, నేతన్నల పరిస్థితులపై మోడీ సర్కార్‌కు కనీస అవగాహన, చిత్తశుద్ది లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించి మోడీ సర్కార్ చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు. ఈ మేరకు కేటీఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరుతో ఏర్పాటుకు సుమారు రూ.1,600 కోట్లు ఖర్చవుతున్నదని ఆయన తెలిపారు. ఈసారి బడ్జెట్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మౌలిక వసతులు కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కనీసం రూ.900 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. మౌలిక వసతుల కల్పన, పాలసీ ప్రోత్సాహకాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేకిన్ ఇండియా ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్‌ను మెగా పవర్లూమ్ క్లస్టర్‌గా గుర్తించి, ఈ ప్రాజెక్టు కోసం కనీసం రూ.100 కోట్లు సాయం చేయాలని కోరారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూ చైన్ బలోపేతం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటి ఖర్చుల కోసం సుమారు రూ.990 కోట్లు అవసరమవుతాయని వివరించారు. ఇందులో సింహభాగాన్ని ఈ బడ్జెట్లో కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి గుండ్ల పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో అవసరమైన స్థలం అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. దీంతోపాటు నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యండ్ లూమ్ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ ఏర్పాటును రాబోయే బడ్జెట్లో ప్రకటించాలని కోరారు. ప్రస్తుతమున్న 20 లక్షల జీఎస్టీ స్లాబ్ ను చేనేత, పవర్లూమ్ కార్మికులకు రూ.50 లక్షల వరకు పెంచాలన్నారు.