Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్రంగా రాస్తేనే భావితరాలకు దిక్సూచి : 'ఏఐకేఎస్ సంక్షిప్త చరిత్ర' పుస్తకావిష్కరణలో సారంపల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చరిత్రలో ఎన్నో ఘటనలు జరిగాయనీ, వాటిని అన్ని పుస్తకాల్లో పొందుపరచలేదని రైతు సంఘం జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి చెప్పారు. చరిత్రను సమగ్రంగా రాస్తేనే భావితరాలకు పుస్తకాలు దిక్సూచిగా నిలుస్తాయని తెలిపారు. చరిత్రను అందరూ రాస్తారు కానీ అది అంత తేలికైన పని కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లోని అలిశెట్టి ప్రభాకర్ వేదికపై బుధవారం ఏఐకేఎస్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా రచించిన 'ఏఐకేఎస్ సంక్షిప్త చరిత్ర' అనే పుస్తకాన్ని సారంపల్లి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సారంపల్లి మాట్లాడుతూ చరిత్ర పుస్తకాలను వర్గ దృష్టితో రాయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రానైట్ పరిశ్రమ ద్వారా చైనా, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయాన్ని రాస్తూనే...గ్రానైట్ భూనిర్వాసితులు, కార్మికులు వేతనాలు, ప్రమాదంలో మరణించిన కార్మికులు జీవితాలు, వారి దుర్భర పరిస్థితులను రాస్తేనే అది సమగ్ర చరిత్ర అవుతుందంటూ ఉదాహరించారు. చరిత్ర ఏకపక్షంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. 1920 కంటే ముందు ఫకీర్లు బ్రిటీష్ పాలకులతో తెగించి పోరాడినా.. ఆ పోరాటాన్ని చరిత్రలో లిఖించలేదన్నారు.
ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. రైతాంగ ఉద్యమాల చరిత్రను ఏఐకేఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సదానంద సరస్వతి, ప్రస్తుత జాతీయ అధ్యక్షులు అశోక్‌ధావలే రాశారని గుర్తు చేశారు. అటువంటి చరిత్రపై ఇప్పుడు దాడి జరగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలనీ, ముఖ్యంగా భారత స్వాతంత్య్రోదమ చరిత్రను చదవాలని సూచించారు.తద్వారా భారత చరిత్రపై కేంద్ర పాలకులు చేస్తున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిజం అజేయం
'అరుణతార అరిబండి' పుస్తకావిష్కరణలో జూలూరి గౌరిశంకర్
ప్రపంచంలో కమ్యూనిజం అజేయమనీ, ఎందుకంటే అది పచ్చి నిజమని హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షులు, తెలంగాణ సామితి అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరి శంకర్ అన్నారు. కమ్యూనిజానికి ప్రస్తుతం అదరణ లేదనే ప్రచారాన్ని చేస్తున్నారనీ, కానీ దోపిడీ, దౌర్జన్యం, వివక్ష, సామాజిక అసమానతలు ఉన్నంత కాలం ఎర్రజెండాకు తిరుగులేదన్నారు. ఆనంగారి భాస్కర్ రచించిన 'అరుణతార అరిబండి' అనే పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో బుధవారం జూలూరి ఆవిష్కరించారు. రైతు సంఘం నాయకులు, సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మినారాయణతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డితో కలిసి అరిబండి అసెంబ్లీలో చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. భీమిరెడ్డి నరసింహరెడ్డి, ధర్మబిక్షం తమ జీవితాలను త్యాగం చేశారంటూ స్మరించుకున్నారు. భూస్వామ్య వ్యవస్థను రద్దు కోసం అనేక పోరాటాలు చేశారని చెప్పారు. నేడు అక్షరాస్యులకు చెప్పినా అర్థం చేసుకోవడం లేదనీ, కానీ ఆనాడు కమ్యూనిస్టులు నిరాక్షరాస్యులతో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా యుద్ధం చేయించారని గుర్తు చేశారు. 'బండెనక బండి కట్టి' అనే పాట పేద ప్రజలను ఉద్యమాలవైపు నడిపించిందన్నారు. నేటి పరిస్థితుల్లో అక్షర యుద్ధం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, పి జంగారెడ్డి, అరిబండి ట్రస్టు కార్యదర్శి డాక్టర్ అరిబండి మనోహర్, డాక్టర్ అరిబండి అనిల్ పాల్గొన్నారు.