Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండ్లు, కూరగాయలతో పాటు 4వేలకుపైగా ఉత్పత్తులు అందుబాటులోకి
- బిగ్‌బాస్కెట్ కో-పౌండర్ వీఎస్ సుధాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టాటా ఎంటర్‌ప్రైజస్, బిగ్‌బాస్కెట్ నాలుగు వేలకుపై ఉత్పత్తులతో కూడిన తమ మొట్టమొదటి వాక్ ఇన్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని మణికొండలో బుధవారం ప్రారంభించింది. ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ స్టోర్‌ను బిగ్‌బాస్కెట్ కో-ఫౌండర్ వీఎస్ సుధాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పూర్వ సభ్యులు బొల్లిపల్లి నగేష్, గువ్వ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఎస్ సుధాకర్ మాట్లాడుతూ..ఇప్పటిదాకా ఆన్లైన్లో ఉన్న తమ సేవలను ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా అందించబోతుండటం సంతోషకరంగా ఉందని చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన ఉత్పత్తులను వినియోగదారులకు సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచుతామని హామీనిచ్చారు. డిజిటల్ ఆధారిత స్టోర్, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలను తమ సంస్థ తీర్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నోప్లాస్టిక్ ప్యాకేజింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి శ్రేణి పరంగా సూపర్మార్కెట్లకు ధీటుగా ఉండే బిగ్‌బాస్కెట్ స్టోర్ స్థానిక మార్కెట్లతో పోలిస్తే అతి తక్కువ ధరలకు వస్తువులను అందిస్తుందని తెలిపారు. ఈ డిజిటల్ ఆధారిత ఔట్లెట్లో వినియోగదారుల సౌకర్యార్ధం సెల్ఫ్, అసిస్టెడ్ బిల్లింగ్ కౌంటర్లు ఉంటాయని చెప్పారు. వినియోగదారులు తామెంచుకున్న ఉత్పత్తులను బిల్లింగ్ కౌంటర్ వద్ద స్కాన్ చేసుకుని ఆన్లైన్ చెల్లింపులు సైతం చేయవచ్చునని సూచించారు. బిగ్‌బాస్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.
నెలకు 15 మిలియన్లకు పైగా వినియోగదారుల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నామని చెప్పారు. కంపెనీ ప్రస్తుత ఆదాయం 1.2 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. తమ స్టోర్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.