Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళ్లతో కవితలు రాసిన ప్రతిభాశాలి
నవతెలంగాణ - సిరిసిల్ల
వైకల్యాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మలుచుకుని అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన 'సిరిసిల్ల' రాజేశ్వరి అనారోగ్యంతో మృతిచెందారు. సిరిసిల్ల జిల్లాకు అరుదైన గౌరవం తెచ్చిపెట్టిన కవయిత్రి బూర రాజేశ్వరి అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మండేపల్లిలో చనిపోయారు. పేద నేతన్న కుటుంబంలో రాజేశ్వరి జన్మించింది. అయితే, ఆమె నడవలేకపోయినా.. తన వైకల్యాన్ని తలచుకుని ఏనాడూ బాధపడలేదు. తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచారు. సుద్దాల హనుమంతు- జానకమ్మ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని సుద్దాల అశోక్ తేజ రాజేశ్వరికి బహుకరించారు. రాజేశ్వరి కవితలను పుస్తకంగా తీసుకొచ్చి.. ఆవిష్కరించారు. ఆమె విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆర్థిక సహకారం అందజేశారు. పింఛన్ మంజూరు చేశారు. 42 ఏండ్ల వయసులో అనారోగ్యానికి గురైన ఆమె చికిత్స పొందినా ఫలితం లేకపోయింది.
ఆమె మరణం సాహితీ లోకానికి తీరని లోటు. ఆమె జీవిత ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకం. సిరిసిల్లకు చెందిన ప్రతిభావంతులైన రచయిత్రి రాజేశ్వరిని అభినందిస్తూ గతంలో మంత్రి తారక రామారావు ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో పాఠ్యాంశాల్లో బూర రాజేశ్వరి జీవితాన్ని పాఠంగా చేర్చారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజేశ్వరి స్పూర్తిదాయక స్టోరీని విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఆమె మృతిపట్ల మంత్రి సంతాపం తెలిపారు.
సిరిసిల్ల రాజేశ్వరి మరణం పట్ల
మంత్రి కేటీఆర్ సంతాపం
నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని కేటీఆర్ అన్నారు. శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి, ఆశయానికి కాదని, రాజేశ్వరి తన మనోస్థైర్యంతో నిరూపించిందని తెలిపారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమని కేటీఆర్, రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సిరిసిల్ల రాజేశ్వరి గురించి.....
సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుండెనిబ్బరంతో కాళ్లను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసంతో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు. ''సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు ఆరాటం ఎంత...'' అంటూ రాజేశ్వరి రాసిన కవితను గమనిస్తే ఆమె అక్షరాల పదును అర్థమవుతుంది. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
2014లో వచ్చిన ఈ కవిత సంకనానికి జీవితమే కవిత్వం అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు ''బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే కానీ అమె మాత్రం జీవిస్తుంది అనుభవిస్తుంది. అనుభవాల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరి బుధవారం శాశ్వతంగా నిష్క్రమించారు. వైకల్యాన్ని సైతం ధిక్కరించి ఆత్మవిశ్వాసపు అక్షరలను కవిత్వంలో ఆవిష్కరించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు. రాజేశ్వరికి వినమ్రంగా కన్నీటి నివాళలు.