Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. నేతల మధ్య నెలకొన్న చిన్న, చిన్న సమస్యల కంటే ప్రజా సమస్యలు పెద్దవని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ 138వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో దోచుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న 'హాత్ సే హాత్' జోడో యాత్రలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి గుండెను, ప్రతి తండాను తట్టిలేపాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వివరించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
వ్యక్తుల ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నదన్నారు. దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారని చెప్పారు. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాలు ఉపాధి హామీ, విద్యాహక్కు, సమాచార హక్కు చట్టాలు వంటి విప్లవాత్మకమైన చట్టాలను తీసుకొచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మహిళా రిజేర్వేషన్ బిల్లుకు బీజేపీ అడ్డుపడిందని తెలిపారు.
దేశ భద్రతపై మోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించగానే మోడీ పీఠం కదిలిందన్నారు. ప్రధాని, హోం మంత్రి కార్యక్రమాల్లో కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని విమర్శించారు.
కార్యక్రమంలో పార్టీ నేతలు మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, బలరాంనాయక్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, మెట్టుసాయి కుమార్, సునీతరావు తదితరులు పాల్గొన్నారు.
సీబీఐని వాడుకుంటున్నాయి
బీజేపీ, బీఆర్ఎస్పై రేవంత్ ఆగ్రహం
రాజకీయ అవసరాలకోసం బీజేపీ, బీఆర్ఎస్ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ విచారణ అనగానే బీఆర్ఎస్, సీబీఐ విచారణ అనగానే బీజేపీ నేతలు సంబరపడిపోయారని గుర్తు చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున కూడా వినతిపత్రం అందజేస్తామన్నారు. వారి కొనుగోలు వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీ మారిన వారేనన్నారు. పార్టీ మారిన వారికి బీఆర్ఎస్లో మంచి పదవులు ఇచ్చారనీ, ఇది కూడా అవినీతి కిందికే వస్తుందన్నారు. అందుకే ఎమ్మెల్యేలకు ఎర పూర్తికాని కేసు అని ఎద్దేవా చేశారు. అందుకే 2018లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలనూ విచారించాలని సీబీఐని కోరతామన్నారు.