Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగసభ
- ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో సభా నిర్వహణ
- హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్
- భక్తరామదాసు కళాక్షేత్రంలో రాష్ట్ర మూడో మహాసభలు
- నగరంలో ఎటుచూసినా ఎర్రజెండాల రెపరెపలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''పోదాం రారో.. వ్యవసాయ కూలీల మహాసభలకు ఊరూవాడ పిల్లాజెల్ల వేలాదిగా తరలుతున్నరు.. సాయుధ పోరు అడ్డమీద సమరానికి సయ్యంటూ.. పోరు గడ్డ ఖమ్మానికి తరలివస్తున్నరంట..!'' సుందరయ్య చూపిన బాటలో కూలీ రైతు చెమట చుక్క బతుకు మెతుకు అయ్యి.. సంఘటితంగా ఖమ్మానికి కదిలింది.. పూర్వవైభవం దిశగా ఎర్రజెండా వేస్తున్న అడుగుకు బాసటగా నిలిచేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగసభకు కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్ నుంచి మహాప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ సభల నేపథ్యంలో ఖమ్మం ఎరుపుమయమయింది. ఎటుచూసినా అరుణ తోరణాలు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈ బహిరంగసభకు లక్షలాదిగా తరలాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. దానికి తగిన విధంగా సభా స్థలిని సిద్ధం చేశారు. సభా ఏర్పాట్లను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం బుధవారం పరిశీలించారు. ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు మధ్యాహ్నం 3 గంటలలోపు మాత్రమే నగరంలోకి అనుమతిస్తారు. బహిరంగసభ అనరతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రారంభం కానున్న మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా 700 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజరురాఘవన్, బి.వెంకట్ ఈ మహాసభల్లో ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కవాత్ వీరులు.. కళాకారులు...
వ్యవసాయ కార్మికసంఘం బహిరంగ, మహాసభల సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శన కోసం మూడువేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లు ఖాకీ పాయింట్, ఎర్రచొక్కాలు, ఎర్ర టోపీ, బూట్లు ధరించి 'ఏక్ దో ఏక్' అంటూ నగర వీధుల్లో కదం తొక్కనున్నారు. వీరిని అనుసరిస్తూ మరో రెండువేల మంది కళాకారులు, ఎర్రచీరలు ధరించిన నారీమణులు ఆటపాటలతో అలరించనున్నారు. బహిరంగసభ ప్రాంగణం ప్రవేశద్వారం మొదలు సభా స్థలి వరకు కేరళ సీఎంకు వీరంతా ప్రత్యేక స్వాగతం పలుకుతారు. మొత్తమ్మీద పోరు ఖమ్మం.. గురువారం కష్టజీవుల గుమ్మంగా మారనుంది.
రూట్‌మ్యాప్ ఇదే...
- కోదాడ మార్గంలో నేలకొండపల్లి, ముదిగొండ నుంచి వచ్చే వాహనాలు వెంకటగిరి క్రాస్‌రోడ్డు మీదుగా ప్రకాశ్‌నగర్, బోస్‌సెంటర్ మీదుగా ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సభకు వచ్చేవారిని దించాలి. తిరిగి ఆ వాహనాలు చర్చి కాంపౌండ్ ప్లైఓవర్ మీదుగా వెళ్లి మమతా రోడ్డు లకారం పార్కు పక్కన ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేయాలి.
- మధిర నియోజకవర్గం మొత్తం బోనకల్ రోడ్డులో అగ్రహారం బ్రిడ్జి, ముస్తఫానగర్, చర్చికాంపౌండ్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చి అర్బన్ తహశీల్దార్ ఆఫీస్ వద్ద ప్రయాణీకులను దించి తిరిగి పీఎస్ఆర్ రోడ్డు, చర్చికాంపౌండ్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లి లకారం పార్కు వద్ద ఖాళీ ప్రదేశంలో పార్క్ంగ్ చేయాలి.
- అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, ఇటు అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా వైరారోడ్డులో వచ్చే వాహనాలు రాపర్తినగర్ వద్ద సభికులను దించి, శ్రీశ్రీ సర్కిల్‌కు కొంత దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో వాహనాలను నిలిపివేయాలి.
- ఇల్లెందు రోడ్డులో వచ్చే వాహనాలు రాపర్తినగర్లో సభికులను దించాక మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్‌హాల్ వెనుక భాగంలో పార్కింగ్ చేయాలి.
- వరంగల్, సూర్యాపేట రోడ్ల మార్గాల్లో వచ్చే వాహనాలు సభికులను జూబ్లిక్లబ్ వద్ద దించి ఎఫ్‌సీఐ పక్కన ఉన్న మేకల నారాయణ ఫంక్షన్‌హాల్ పక్కన ఖాళీ ప్రదేశం, బైపాస్ రోడ్డు నుంచి దాన్వాయి గూడెం వెళ్లే ప్రాంతంలో ఉన్న ఉషాహరి ఫంక్షన్‌హాల్ పక్కన ఖాళీ స్థలం, రాపర్తినగర్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ పక్క నుంచి వెళ్తే ఉండే ఎంపీ గాయత్రి రవికి చెందిన ఖాళీ సైట్లో వాహనాలను పార్కింగ్ చేయాలి.
- వాహనాల పార్కింగ్, రాకపోకలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అంబడిపూడి సుధాకర్ (9848582636), వజినేపల్లి శ్రీనివాసరావు (8187804416), మోటమర్రి జగన్మోహన్రావు (9948477260)లను ఫోన్లో సంప్రదించాల్సింగా సూచించారు.