Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
- భద్రాద్రి రాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి
- ప్రసాద్ పథకం పనులకు శంకుస్థాపన -గిరిజన పూజారులతో సమ్మేళనం
నవతెలంగాణ-భద్రాచలం
విద్యార్థులు చదువుపై మనసు లగం చేయాలని, చదువు పూర్తై స్వావలంబన సాధించాక తిరిగి సమాజ పురోగతికి దోహదం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్భోదించారు. సమాజ పురోగతి బాధ్యత ప్రభుత్వానిదో లేక సంబంధిత సంస్థలదో మాత్రమే కాదనీ, అది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని చెప్పారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలం క్షేత్ర పర్యటన చేశారు. తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం వెళ్లిన ఆమె అక్కడి నుంచి బూర్గంపాడు మండలం సారపాక వరకు ప్రత్యేక హెలిక్యాప్టర్లో వచ్చారు. అనంతరం కాన్వారు ద్వారా భద్రాచలం చేరుకున్నారు. తొలుత శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో రాష్ట్ర గవర్నర్ తమిళి సైతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రసాద్ పథకం పనుల శిలాఫలకంను ఆమె ఆవిష్కరించారు. అనంతరం వీరభద్ర కళ్యాణ మండపానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో విద్యా సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్రపతి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలుత తెలుగులో అందరికీ నమస్కారం అని అభివాదం చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రముఖ కవి దాశరధి రాసిన - నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే కవితను ప్రస్తావించారు. తెలంగాణలో మొదటిసారి చేస్తున్న పర్యటనలో ఆలయాల్లో దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రార్ధించే అవకాశం లభించిందని అన్నారు. పర్యాటక రంగం అబివృద్ధితో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రసాద్ పథకం ద్వారా దేవాలయాల్లో చేపడుతున్న సౌకర్యాల మెరుగుదలతో దేశ, విదేశీ యాత్రికుల తీర్థ యాత్రలకు వచ్చే అవకాశాలు పెరుగుతాయని, దాంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ సంతరిల్లుతుందన్నారు. తెలంగాణ వనవాసీ పరిషత్ ద్వారా గిరిజన సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు జరుగుతున్న కృషిని కొనియాడారు. సమ్మక్క సారలమ్మ లాంటి జాతరలు సమాజ మూల విలువలను పటిష్టం చేస్తాయని చెప్పారు. అన్ని ప్రగతి రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలని, గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మరిన్ని చర్యలు అవసరమని తెలిపారు.
గిరిజన సంక్షేమానికి చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్య, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు పలు చర్యలు తీసుకున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 23 ఏకలవ్య పాఠశాలలు నడుస్తున్నాయని, 33 బాలికల గురుకుల పాఠశాలలు, 183 గురుకుల పాఠశాలలు, 332 ఆశ్రమ, 24 మినీ గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. విదేశాల్లో చదువుకునే వారికి అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా రూ.20 లక్షల సహాయం ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. మేడారం, నాగోబా జాతరలను రాష్ట్ర జాతరలుగా గుర్తించామన్నారు. 3,146 గిరిజన ఆవాసాలను గుర్తించి గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజన బిడ్డలకు పాలించే అధికారం కల్పించామన్నారు. మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ముందస్తు అరెస్టులు
భద్రాచలం ఏజెన్సీలో రాష్ట్రపతి పర్యటన ప్రశాంతంగా ముగియటంతో అధికార యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలో పలువురు రాజకీయ పార్టీ నాయకులను, కుల సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సంఘటనపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు పోదెం వీరయ్య, రేగా కాంతారావు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల సెక్రటరీ రోనాల్డ్ రాస్, డీఐజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా. వినీత్, ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.