Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్కృత సాహిత్యంలో ఎనలేని కృషి
- 16వ యేటనే శబరి పరిదేవనం, మనోరమ రచనల ఆవిష్కరణ
- దేశసమగ్రతను ప్రతి పౌరుడూ కాపాడాలని స్ఫూరించిన రచనలు
- భాష్యం మరణం పట్ల ముఖ్యమంత్రి సహా మంత్రుల సంతాపం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీభాష్యం విజయసారథి(86) బుధవారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా కేంద్ర సమీపంలోని చేగుర్తి గ్రామానికి చెందిన ఆయన కొంత కాలంగా కరీంనగర్‌లోనే నివాసముంటున్నారు. 1936, మార్చి 10న నరసింహాచార్యులు, గోపమాంబ దంపతులకు జన్మించిన ఆయన తన ఏడో ఏట నుంచే పద్య రచన ప్రారంభించారు. తల్లి ద్వారా నేర్చుకున్న సంస్కృతిక పాండిత్యాన్ని తన కలం ద్వారా పండించిన విజయసారథి ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో సాగినప్పటికీ సంస్కృత పండితునిగా ప్రతిభ కనబరిచారు. పదకొండో ఏటనే శారదా పదకింకిణి, 16వ ఏట శబరి పరిదేవనం, 17 ఏట మనోరమ రచించారు. మందాకిని కవిగా మన్ననలు పొందిన ఆయన వందకు పైగా సోత్రాలు, సుప్రభాతాలు, దేశభక్తి రచనలు, అధిక్షేప కవితలు, ఆప్త లేఖ, ఖండకావ్య పరంపర, అనువాద రచనలు, వర్ణన కావ్యాలు రచించారు. దేశ స్వాతంత్య్ర సమగ్రతను పరిరక్షించడం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని సూచించారు. ఆయన అఖిల భారత స్థాయిలో ముంబయి, కోల్కత్తా, నాగపూర్, ఢిల్లీ వంటి అనేక నగరాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. 30 ఏండ్లుగా మానేర ునది తీరాన కరీంనగర్లో బొమ్మకల్ రోడ్లో యజ్ఞవరాహ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి వేదాల్లోని మౌలిక జ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరుంది. వీరి సాహిత్య కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. అంతకు ముందు స్వర్ణకంకణం, క్రియేటివ్ సాంస్క్రీట్ పోయెట్, ఉత్తమ సంస్కృతిక పండితులుగా (తెలుగు విశ్వవిద్యాలయం) బిరుదులు పొందారు. 2017లో తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ఇలా అనేక అవార్డులు, బిరుదులు అందుకున్న ఆయన వాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సహా జిల్లా సాహిత్యకారులు శ్రీభాష్యం భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.