Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో కదంతొక్కిన వ్యవసాయ కార్మికులు
- అదిరిన కవాతు.. దద్దరిల్లిన కళా దరువులు
- ఊళ్లకుఊళ్లూ కదలడంతో ఉప్పెనైన నగరం
- విద్యుత్ పోరాట వీరుడు రామకృష్ణకు లాల్‌సలాం..
- వేలాది మందితో ప్రదర్శన.. మూడు కి.మీ పైగా జనం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. కవాతు చేస్తూ.. కోలాటమాడుతూ.. ముసలి ముతక.. ఆడామగ.. యువతీ యుకులు.. ఊళ్లకు ఊళ్లూ కదలడంతో ఖమ్మం నగరమంతా ఎరువుమయమయింది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా గురువారం నగరంలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరాగా.. దీనికి ముందు నిర్వహించిన ప్రదర్శన కనీవినీ ఎరుగని రీతిలో సాగింది. మూడు కిలోమీటర్లకు పైగా బారులుదీరిన వేలాది మంది జనంతో ర్యాలీ ఆకట్టుకుంది. మాజీ పార్లమెంట్ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తమ్మినేని వీరభద్రం ఈ ర్యాలీని ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో ప్రారంభించారు. ప్రదర్శన మయూరిసెంటర్, పాతబస్టాండ్, పాత ఎల్ఐసీ ఆఫీస్ మీదుగా జడ్పీ సెంటర్‌కు చేరాక విద్యుత్ పోరాట వీరుడు సత్తెనపల్లి రామకృష్ణ స్మారక స్థూపం వైపు అందరూ మళ్లీ జోహార్లు అర్పించారు. లాల్‌సలాం సత్తెనపల్లి రామకృష్ణ అంటూ నివాళి అర్పించారు. సభా ప్రాంగణం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదాన ప్రవేశ ద్వారం నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ను స్వాగతించారు.
ఎరుపుమయం..
ఖమ్మం ఎరుపుమయమయింది. ఈ ప్రదర్శనలో ఎర్రచీరలు ధరించిన మహిళలు సుమారు 3000 మంది, ఎర్రచొక్కాలు ధరించిన ఐదువేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లతో సాగిన రెడ్కవాత్ ఆకట్టుకుంది. మహిళల కోలాటంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, నాయకులు బుగ్గవీటి సరళ కూడా కోలాటమాడుతూ ర్యాలీకి మరింత ఉత్సాహం తీసుకొచ్చారు. చిన్నారులు సైతం ఎరుపు మురిపాన్ని చూపుతూ కవాత్‌తో ముందుకు నడిచారు. వృద్ధులు సైతం దద్దరిల్లేలా డప్పు దరువు వేశారు. సీఐటీయూ నగర నాయకులు నర్రా రమేష్ కూతురు లోహిత ఏఐఏడబ్ల్యూయూ జెండాలు 42 పెట్టుకుని బైక్ నడుపుతూ చేసిన విన్యాసాలు అదరహౌ అనిపించాయి. గిరిజనుల కొమ్ము నృత్యం, బంజారా నృత్యాలు ప్రదర్శనకు హైలట్‌గా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చద్దిమూటలు కట్టుకుని, వాటర్ బాటిల్స్, క్యాన్లు వ్యాన్లు, లారీలు, బస్సుల్లో వేసుకుని కదలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు బిడ్డలను సైతం చంకలో వేసుకుని ర్యాలీకి హాజరయ్యారు. కేరళ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రన్ సైతం ఈ ప్రదర్శనను చూసి ముగ్దులయ్యారు. ఓపెన్ టాప్ వ్యాన్ పైనుంచి తన సెల్‌ఫోన్ కెమెరాతో ర్యాలీ దృశ్యాలను బంధించారు.
సీఎం పినరయ్‌కు అపూర్వ స్వాగతం
కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఖమ్మం వచ్చిన ఆయనకు స్థానిక సుందరయ్య భవన్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నేతలు తమ్మినేని వీరభద్రం, బి.వెంకట్, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు, మెరుగు సత్యనారాయణ, రెడ్‌షర్ట్ వాలంటీర్లు, బంజార మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. సంఘం ఆవిర్భావకులు సుందరయ్య విగ్రహానికి విజయన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కొద్దిసేపు కార్యాలయంలో గడిపిన ఆయన ఆ తర్వాత స్థానిక ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జిల్లా నాయకులతో పాటు ఐఎంఏ డాక్టర్లు, ఐలూ నాయకులు, విద్యుత్ ఉద్యోగసంఘాల నేతలు, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, ఆవాజ్, ఐటీ హబ్ కంపెనీల ప్రతినిధులు తదితరులు సీఎంకు వినతిపత్రాలు సమర్పించారు. పలు పాఠశాలల చిన్నారులు సీఎంను కలిశారు.