Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరాది.. దక్షిణాది పార్టీలని కాదు.. విధానాలు ముఖ్యం...
రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మంచి పాత్రను పోషిస్తాయి
- గవర్నర్ వ్యవస్థకు సంబంధించి పరిధులు దాటేసిన బీజేపీ
- ఆ పార్టీని నిలువరించాలంటే బీఆర్ఎస్.. ఇతర పార్టీలను కలుపుకుని పోవాల్సిందే
- ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించటంలో కాంగ్రెస్ విఫలం
- 'నవతెలంగాణ' ఇంటర్వ్యూలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
'ఆ పార్టీ ఉత్తరాదికి చెందిందా.. లేక దక్షిణాదికి చెందిందా అనేది ముఖ్యం కాదు... అది అనుసరించే విధానాలెలా ఉన్నాయి..? అవి ప్రజలకు మంచి చేస్తున్నాయా..? లేదా..? అనేదే కీలకం... ఆయా విధానాలనుబట్టే పార్టీల మనుగడ ఆధారపడి ఉంటుంది...' అని కేరళ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం, సుహృద్భావ వాతావరణం ఎంతో ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. వాటిపైన్నే దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ... అలాంటి సమాఖ్య స్ఫూర్తి సూత్రాలన్నింటికీ యదేచ్ఛగా తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మంచి పాత్రనే పోషిస్తాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సైతం తన విధానాలను పున:సమీక్షించుకుంటే కొన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆ పార్టీ... తన పాత్రను సమర్థవంతంగా పోషించటంలో విఫలమైందని విమర్శించారు. ఖమ్మంలో ప్రారంభమైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన విజయన్... నవతెలంగాణ ప్రతినిధి బి.వి.యన్.పద్మరాజుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సమాఖ్య వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తున్న వైనం, తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు, కేరళలోని విజింజమ్ పోర్టు ఆందోళన, వివిధ రాష్ట్రాలకు నిధుల విడుదలలో కేంద్రం వివక్ష, బీఆర్ఎస్ ఏర్పాటు తదితరాంశాలపై అడిగిన ప్రశ్నలకు విజయన్ విస్పష్టమైన సమాధానాలిచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
మీరు ఎన్నో ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.. కేరళకు వరసగా రెండోసారి సీఎం అయ్యారు.. ఈ క్రమంలో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో జోక్యం చేసుకోవటాన్ని ఎప్పుడైనా చూశారా..?
గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో, వాటి రోజువారీ వ్యవహారాల్లో తలదూర్చటం కొత్తేమీ కాదు. వాస్తవానికి కాంగ్రెస్ హయాంలో కూడా ఇది కొనసాగింది. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ల వ్యవస్థను కేంద్రం ఉపయోగించుకునేది. అయితే అప్పుడు వారికి కొన్ని పరిధులు, పరిమితులున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో గవర్నర్లకు అలాంటి పరిధులు, పరిమితులేం లేవు. అప్పటికీ, ఇప్పటికీ ప్రధానమైన తేడా అదే. మీరు చరిత్రను మననం చేసుకుంటే... 1957లో దేశం మొత్తంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకోవటం ద్వారా నాటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కేంద్రం డిస్మిస్ చేసింది. అధికారంలోని కమ్యూనిస్టు పార్టీకి అసెంబ్లీలో మెజార్టీ ఉన్నప్పటికీ కేంద్రం ఆ చర్యకు పాల్పడింది. ఇప్పుడు బీజేపీ ఎలాంటి పరిధులు, పరిమితుల్లేకుండా ఆ వ్యవస్థను మరింత ఎక్కువగా, దూకుడుగా ఉపయోగించుకుంటోంది.
మీ రాష్ట్రంలో గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్... అనేక తప్పులు చేస్తూ మీ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కదా..?
అవన్నీ వ్యక్తిగత విషయాలు. వాటిపై నేనేమీ వ్యాఖ్యానించబోను.
ఇటీవల మీరు ప్రధాని మోడీని ఢిల్లీలో కలిశారు.. ఆ సందర్భంగా సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలంటూ కోరారు కదా..? ఆయన వైపు నుంచి స్పందన ఎలా ఉంది...?
మా భేటీలో అనేకాంశాల గురించి చర్చించాం. సంభాషణ సమయంలో ప్రధాని వైపు నుంచి సానుకూల స్పందనే వచ్చింది. అనేక మెమోరాండాలను కూడా సమర్పించాం. అయితే అవన్నీ విజ్ఞప్తుల క్రమంలోనే ఉన్నాయి కదా..? మా భేటీ సందర్భంగా పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నాం.
అలాంటప్పుడు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని భావించవచ్చా..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ సంబంధాలు, వాతావరణం ఉండటం చాలా అవసరం. అప్పుడే దేశం అన్ని రంగాల్లో బలోపతమవుతుంది. కానీ బీజేపీ హయాంలో సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సూత్రాలన్నీ ఉల్లంఘనకు గురవుతున్నాయి. రాష్ట్రాలు లేకుండా కేంద్రం లేదు. వాటికి సంబంధించిన నిధులు, విధులు, అధికారాలను వాటికి ఇవ్వాలి. తద్వారా రాష్ట్రాలను సంతృప్తి పరచాలి.
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది...దీన్ని ఎలా చూడొచ్చంటారు...?
దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది ఇదే. ఎక్కడైతే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉంటాయో... అక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థలు వాలిపోతున్నాయి.
ఇక్కడ తెలంగాణలో కూడా అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది...ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది..ఈ అంశంపై మీ స్పందన...?
అవును నిజమే. బీజేపీ స్టైలే అది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాదు.. డబ్బుని కూడా ఆ పార్టీ వాడుతున్నది.
ఇదే రకమైన పద్ధతుల్లో ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ లాగేసుకున్నది. ఇది దేశానికి ఏ రకంగానూ మంచిది కాదు కదా..?
అవును. అయితే రాజకీయ నాయకుల వ్యక్తిత్వాల్లో చాలా తేడా వస్తోంది. వారిలో ఎక్కువ మంది అతి తొందరగా కుబేరులై పోవాలని తహతహలాడుతున్నారు. అలాంటి వారి బలహీనతలను బీజేపీ ఆసరాగా చేసుకుంటోంది. వందల, వేల కోట్లను అందుకోసం వెచ్చిస్తున్నది.
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తన పాత్రను సమర్థవంతంగా పోషించలేకపోతున్నదనే వాదనపై మీ అభిప్రాయం...?
దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ అతి పెద్దది. కానీ అది బీజేపీకి 'బీ' పార్టీగా మారిపోతున్నది. ఎందుకంటే ఆర్థిక విధానాల్లో ఆ రెండు పార్టీలకు పెద్ద తేడా లేదు. అవి రెండూ ఒకే పాలసీలను అమలు చేస్తున్నాయి. గతంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా కాంగ్రెస్ హయాంలో నయా ఉదారవాద విధానాలను అమల్లోకి తెచ్చారు. వాటిని ఇప్పుడు బీజేపీ శరవేగంగా అమలు చేస్తున్నది. వాటిని అమలు చేయటంలో కాంగ్రెస్‌కు బీజేపీకి పెద్ద తేడా లేదు. కనీసం ఇప్పుడైనా నయా ఉదారవాద ఆర్థిక విధానాలను తెచ్చి తప్పు చేశామంటూ కాంగ్రెస్ పశ్చాత్తాపడుతున్నదా..? అంటే అదీ లేదు. విదేశాంగ విధానానికి సంబంధించి చూస్తే... మన దేశం అమెరికాతో అంటగాకుతోంది. ఆ రకమైన విధానాన్ని ప్రారంభించింది ఎవరు..? కాంగ్రెస్సే కదా..? యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో అణు ఒప్పందానికి అంగీకరించి.. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసినప్పుడు వామపక్షాలుగా మేం వ్యతిరేకించాం. కానీ కాంగ్రెస్ దాన్ని ప్రేరేపించింది. ఇప్పుడు బీజేపీ ఈ విషయంలో మనకున్న పరిధులు, పరిమితులన్నింటినీ దాటింది. దాంతో మన దేశం అమెరికాకు వ్యూహత్మక భాగస్వామిగా మారిపోయింది. మనం సామ్రాజ్యవాదాన్ని బలంగా వ్యతిరేకించిన సందర్భంలో తృతీయ ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూశాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఇక మత ఘర్షణలు, మతోన్మాద చర్యల విషయానికొస్తే... అలాంటి సంకేతాలు వెలువడినప్పుడు కఠినంగా వ్యవహరించి లౌకికత్వాన్ని పరిరక్షించాలి కదా..? సెక్యులరిజం అనేది మతతత్వ శక్తులకు సైద్ధాంతికంగా పూర్తి వ్యతిరేకమైంది. అలాంటి వాటిని నిలువరించి, సెక్యులరిజాన్ని కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆ పార్టీకి ఇదే అసలు సమస్య.
గతంలో కేరళలో వరదలొచ్చాయి.. కానీ ఆ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం మొండి చేయి చూపింది. అదే గుజరాత్ విషయంలో మాత్రం వరదలొచ్చిన వెంటనే ప్రధాని మోడీ స్పందించారు.. ఎక్కువ మొత్తంలో ఆ రాష్ట్రానికి నిధులిచ్చారు..? దీన్ని దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షగా చూడొచ్చా..?
మేం గుజరాత్‌కు ఎక్కువ నిధులివ్వటాన్ని తప్పుబట్టటం లేదు. ఆ రాష్ట్రం కూడా మన దేశంలో భాగమే కదా. కానీ కేరళకు చాలినన్ని నిధులు సకాలంలో ఇవ్వకపోవటం బాధాకరం. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలంటూ మనం వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అది సరికాదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎన్ని నిధులిస్తున్నారు..? బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎన్ని నిధులిస్తున్నారు..? అనేదే చూడాలి. అదే ప్రధాన సమస్య.
కేరళలోని విజింజమ్ పోర్టు ఆందోళనలో బీజేపీ పాలుపంచుకోవటం రాజకీయ క్రీడలో భాగమేనంటారా..?
లేదు. ఆ ఆందోళనలో బీజేపీ పాల్గొనటం లేదు. దాని వెనుక చాలా ఎన్జీవోలున్నాయి. అందువల్ల అదేమీ పొలిటికల్ గేమ్ కాదు.
రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర ఎలా ఉండబోతుందంటారు..?
వచ్చే ఎన్నికల్లో వాటి పాత్ర బాగానే ఉంటుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో అవి మంచి బలాన్నే కలిగున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్... బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో దక్షిణాది నుంచి వచ్చిన పార్టీలు ఢిల్లీలో జయప్రదం కాలేవంటూ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యాఖ్యానిస్తోంది. దీనిపై మీరేమంటారు..?
ఇక్కడ సమస్య దక్షిణాది.. ఉత్తరాది అనేది కాదు. ఆయా పార్టీలు అనుసరించే విధానాలు ముఖ్యం. వామపక్షాలను కలుపుకుని పోవటం ద్వారా బీఆర్ఎస్... బీజేపీని నిలువరించేందుకు ప్రయత్నించాలి. కాంగ్రెస్ కూడా తన విధానాలపై పున:సమీక్షించుకునేందుకు సిద్ధమైతే... కొన్ని మంచి ఫలితాలను సాధించొచ్చు.
తెలంగాణ ప్రభుత్వం అమల్జేస్తున్న రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలపై మీ అభిప్రాయం..?
అవి రైతులకు ఉపయోగకరమైనవే. అలాంటి పథకాలను కేంద్రం కూడా అమల్జేయాలి. ఇప్పుడున్న వాటికి అధిక నిధులు వెచ్చించి, ఖర్చు చేయాలని మేం కోరుతున్నాం. కానీ ప్రతీ బడ్జెట్ సందర్భంగా కేంద్రం ఆయా డిమాండ్లను విని వదిలేస్తున్నదే తప్ప వాటిని పరిశీలించి, అమలు చేయటం లేదు.