Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలి
- కేంద్రంపై మరో పోరాటానికి సిద్ధం
- జయశంకర్-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- జిల్లా కేంద్రంలో సింగరేణి పోరు దీక్ష
- సీపీఐ(ఎం) సంఘీభావం
నవతెలంగాణ-భూపాలపల్లి
'తెలంగాణ గుండెకాయ సింగరేణిని ప్రయివేటీకరణ చేయనని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు బొగ్గు బ్లాకులు వేలం వేయడానికి రంగం సిద్ధం చేశారని, దానికి వ్యతిరేకంగా చేస్తున్న సింగరేణి పోరుదీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని, లేదంటే తెలంగాణ ఉద్యమం తరహాలో సింగరేణి ఉద్యమం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. గురువారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 'బీజేపీ హటావో.. సింగరేణి బచావో' నినాదంతో సింగరేణి పోరుదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షులు బి. వెంకట్రావు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ.. దేశంలో ప్రతిపక్షాలు బలంగా లేవని, వారి బలహీనతను అడ్డుపెట్టుకుని నరేంద్రమోడీ ప్రధానిగా కొనసాగుతున్నాడన్నారు. ప్రధాని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు శక్తులకు దారదత్తం చేసేందుకు కుట్రపన్నుతున్నాడని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తొమ్మిదేండ్లలో ఆదానీ ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా ఎదిగాడంటే మోడీ అండదండలతోనే అని ఆరోపించారు. భూపాలపల్లి పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందంటే ఇక్కడ సింగరేణి ఉండటం వల్లనేనని తెలిపారు. అలాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీక్ష చేపట్టినట్టు చెప్పారు. భారతదేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించే సింగరేణి బొగ్గుబ్లాకులను వేలం వేస్తున్న ప్రధాని మోడీిని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, కార్యదర్శి రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య మాట్లాడారు. 133 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. బొగ్గు నిల్వలు ఎక్కడున్నా తవ్వే అవకాశం సింగరేణికి ఉందని తెలిపారు. బొగ్గుబ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ఎన్నిసార్లు కోరినా చలించలేదని, ప్రాణాలు అడ్డుపెట్టైనా బొగ్గు బ్లాకులను కాపాడుకుంటామని స్పష్టంచేశారు.
బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే... : సీపీఐ(ఎం)
కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించాల్సిందేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన పోరు దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. రామగుండం పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ బొగ్గు గనులను ప్రయివేటీకరించబోమని చెప్పి వెళ్లి తీరా గనుల ప్రయివేటీకరణకు తలుపులు తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే సింగరేణి సంస్థకు చెందాల్సిన నాలుగు బొగ్గు బ్లాకులను రాత్రికి రాత్రే కేంద్ర మంత్రి ప్రయివేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికి వేలం వేయడాన్ని ఖండించాల న్నారు. భవిష్యత్‌లో సింగరేణి సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని, ఇప్పటి నుంచే కేంద్రం వైఖరిని ఎండగట్టాలని సూచించారు. రాబోయే కాలంలో బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కటకం జనార్ధన్, జిల్లా నాయకులు బుర్ర రమేష్, కళ్లెపు రఘుపతిరావు, తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం నాయకులు, సీపీఐ(ఎం) నాయకులు వి రాజయ్య, సిహెచ్ రమేష్, భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.