Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కితాబు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం చేపడుతున్న ప్రయోజనాలు ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కితాబిచ్చారు. గురువారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె ప్రత్యేక బలహీన గిరిజన సమూహాలు (పీవీటీజీఎస్) సభ్యులు, విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, కనీస మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకుంటున్న కార్యక్రమాల పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా వైద్య, విద్య, రోడ్లు,విద్యుత్, రైతుబంధు, మిషన్ భగీరథ, కళ్యాణ్ లక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఎస్టీల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వీడియో ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రపతికి వివరించారు. 'రాష్ట్రంలో 10 గిరిజన తెగలైన లంబాడాలు, కోయలు, గోండులు, ఎరుకల, పర్దానులు, ఆంధులతో పాటు ఆదిమ జాతి తెగలయిన కొల్లాములు, చెంచులు, తోటి, కొండారెడ్డి తెగలు ఉన్నాయి. రాష్ట్రంలో నాలుగు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలున్నాయి. తొమ్మిది జిల్లాల్లో షెడ్యూల్ ప్రాంతాల్లో అవి విస్తరించి ఉన్నాయి. వీటిలో షెడ్యూల్ మండలాలు, 3,146 గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఏడాది రైతు బంధు ద్వారా 8.5 లక్షల మంది గిరిజనులకు ఇప్పటివరకురూ. 7,349 కోట్ల వ్యవసాయ పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించింది. 6.08 లక్షల గిరిజన ఆవాసులకు మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీరు అందుతుంది. గిరిజనుల ఆరోగ్య వసతుల కోసం 437 సబ్ సెంటర్లు, 32 బర్త్ వెయిటింగ్ రూములు, 7 డయాగ్నొస్టిక్ హబ్‌లను నిర్మించాం. ఆదిమ గిరిజన తెగల ప్రాంతాల్లో 31 పాఠశాలలు, కోలముల కొరకై ప్రత్యేకించి ప్రాథమిక పాఠశాలలు, సైనిక్ పాఠశాల, న్యాయవిద్య, ఫైన్ ఆర్ట్స్ కొరకు ప్రత్యేక కళాశాల ఏర్పాటుతో పాటు వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలను నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 918 గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పొందారు. అంతే కాకుండా సీఎం ఎంటర్ ప్రెన్యూర్ పథకం కింద 205 మంది యువతకు ఎనిమిది విభాగాల్లో సహకారం అందించాం. ఇందులో ఐదుగురు ఆదిమ గిరిజన తెగలకు చెందిన వారు కాగా... ఇద్దరు చెంచులు, ఇద్దరు తోటీలు, ఒక కొల్లొం తెగకు చెందిన వారున్నారు. 440 ఆదిమ జాతి గిరిజన గ్రామాలలో రూ.60 కోట్లతో అంతర్గత రోడ్ల సదుపాయం, 53 ఆదిమ జాతి ఆవాసాలలో రూ.2.39 కోట్లతో సోలార్ విద్యుదీకరణ చేపట్టి 443 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. 3,467 గిరిజన గ్రామాలకు రూ.221 కోట్లతో త్రీఫేజ్ విద్యుదీకరణ అందించాం. గిరిజన గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరు చేశాం. ఇప్పటి వరకు రూ.3,275 కోట్లతో 5,162 కిలోమీటర్ల రహదారులను నిర్మిం చాం. 16,375 ఆదిమ జాతి పిల్లలు, గర్భిణీలు, బాలింతలు కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు గిరి పోషణ పథకం ద్వారా లబ్ధి పొందుతు న్నారు.... ' అని వివరించారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.