Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(బీఆర్ఎస్)ను సవాల్ చేసిన కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తిరిగి సమీక్షించాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండగా.. ఆ కేసులో విచారణ చేపట్టి ఏవిధంగా ఉత్తర్వులు ఇవ్వగలమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉత్సాహం చూపుతోందని ప్రశ్నించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎందుకంత ప్రేమని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు లేవనెత్తిన విషయాలపై వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది.
స్పోర్ట్స్ కోటా అమలు చేయాలి
తమ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లను పంచాయతీరాజ్ కార్యదర్శి పోస్టుల భర్తీలో అమలు చేయాలని కోరుతూ దివ్యాంగ క్రీడాకారుడు సూర్యాపేట జిల్లాకు చెందిన రావుల నరేశ్ యాదవ్ ఇతరులు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలు చేయడం లేదని, దీంతో తాము పంచాయతీ కార్యదర్శి పోస్టులను కోల్పోయామని చెప్పారు. ఈ రిట్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీపీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. వినతిపత్రం ఇచ్చినా చర్యలు లేవన్న పిటిషనర్ల వాదనల తర్వాత హైకోర్టు వాళ్ల వినతిపై చర్యలు తీసుకుని చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
రిట్ వేసిన సునీల్ కనుగోలు
అభ్యంతర పోస్టులకు సంబంధించి దాఖలైన కేసులో తనకు సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన నోటీసులపై కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. పోలీసుల 41ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. మియాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన స్ట్రాటజీ విభాగం వార్ రూంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేసింది. అక్కడ పనిచేసే ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, ఎం. ప్రతాప్‌లపై కేసు నమోదు చేసింది. తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసును సునీల్ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరగనుంది.