Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బుర్రాకు కల్లుగీత కార్మిక సంఘం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని టాడి కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం కోరింది. గీతవృత్తిలో ప్రమాదం జరిగిన వారికి కార్పొరేషన్ నుంచి తక్షణ సాయం అందిస్తున్న బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని అభినందించింది. గీత కార్మికులు, గౌడ యువతీ,యువకులకు ఉపాధి కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అందుకు తగిన విధంగా బడ్జెట్ కేటాయించడంతోపాటు రుణ సౌకర్యం కల్పించాలని కోరింది.
ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో బుర్రా వెంకటేశానికి ఆ సంఘం రాష్ట్ర బృందం వినతిపత్రం సమర్పించింది. డిసెంబర్ 18 నుంచి ఇప్పటివరకు ప్రమాదానికి గురైన 439 మందికి గీత కార్మికులకు ప్రభుత్వం రూ. 75 లక్షలు అందించారని నాయకులు తెలిపారు.
ఆయా కుటుంబాలకు కార్పొరేషన్ నుంచి రుణ సౌకర్యం కల్పించి ఆదుకోవాలనీ, చదువుకునే పిల్లలకు గురుకుల రెసిడెన్షియల్లో సీట్లు ఇవ్వాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు దహన ఖర్చుల కింద ఇస్తున్న రూ 25 వేలను రూ. 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వైద్య ఖర్చులకు ఇస్తున్న రూ. 15 వేలను రూ. 25 వేలకు పెంచాలనీ, ప్రమాద నివారణకు 'సేఫ్టీ రోప్' తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో భూమి కొనుగోలు పథకంలో 439 సొసైటీలకు ఇచ్చిన భూమికి ఫెన్సింగ్ చేయించి పొట్టి తాటి, ఈత, ఖర్జూర, జీనుగు చెట్లను ఇవ్వాలనీ, వాటికి నీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. జీవో 560 ప్రకారం దరఖాస్తు చేసుకున్న సొసైటీలకు ఐదెకరాల చొప్పున భూమి పట్టా చేయించాలన్నారు.
వాటిని త్వరలో అమలు చేసే విధంగా చూస్తామని ముఖ్యకార్యదర్శి హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు యం.వి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లుతోపాటు రాష్ట్ర నాయకులు ఎల్గూరి గోవిందు, వి.వెంకట నరసయ్య, బూడిద గోపి, ఎస్ రమేష్‌గౌడ్, గౌని వెంకన్న, బాల్నే వెంకటమల్లయ్య, బొలగాని జయరాములు, బండకింది అరుణ్, గాలి అంజయ్య, పామనుగుల్ల అచ్చాలు తదితరులు ఉన్నారు.