Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి
నవతెలంగాణ-కాప్రా
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి అన్నారు. ఐద్వా అఖిల భారత 13వ మహాసభ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ కమలానగర్ని కార్యాలయంలో గురువారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు శారద జెండా ఆవిష్కరించారు. అనంతరం అరుణజ్యోతి మాట్లాడుతూ.. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, లైంగికదాడులు పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో పాస్ చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో, సంఘ సంస్కరణ ఉద్యమాల్లో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది మహిళలు ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. నాడు పోరాడి సాధించుకున్న హక్కులను హరించే విధంగా పాలకులు విధానాలను రూపొందిస్తున్నారన్నారు. మహిళల కట్టు, బొట్టు, వస్త్రధారణ, తినే ఆహారం సహా అన్ని అంశాల్లో ఆంక్షలను విధిస్తూ సమాజ తిరోగమన విధానాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మహిళలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎం.వినోద మాట్లాడుతూ.. సంఘాన్ని మరింత బలపరిచుకు నేందుకు గ్రామ గ్రామాన సభ్యత్వం చేర్పించాల న్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కోశాధికారి సఫియా సుల్తానా, ఉపాధ్యక్షులు బి.మంగ, ఎన్.పద్మ, ఎ.విజయ, సుగుణ, మనెమ్మ, నాగమణి, నజీమా నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.