Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీనియర్ నటుడు వల్లభనేని జనార్దన్(63) తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడకు చెందిన జనార్దన్‌కు చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఎక్కువ ఉంది. కాలేజీ రోజుల్లోనే పలు నాటకాల్లో కీలకపాత్రలు పోషించారు. కళాశాల చదువు పూర్తైన వెంటనే 'కళామాధురి' నాటక సంస్థను స్థాపించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తెలిసినవారి సాయంతో సినిమా ఇండిస్టీలోకి అడుగుపెట్టి.. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'గజదొంగ'లో మొదటిసారి వెండితెరపై నటించారు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలో దర్శకుడు విజయబాపినీడు కుమార్తెను ఆయన వివాహమాడారు. అనంతరం తన మామయ్య తెరకెక్కించిన 'గ్యాంగ్ లీడర్'లో పోలీస్ అధికారిగా నటించి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. సినిమాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోనూ ఆయన నటించారు. నిర్మాత, దర్శకుడిగా పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.