Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరాలు 4.44 శాతం పెరిగాయి
- విపరీతమైన సైబర్, వైట్‌కాలర్ నేరాలు
- ఒకే తరహా పోలీసింగ్‌తో ప్రజలకు చేరువయ్యాము
- జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించాం
- మావోయిస్టులను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వం
- శాంతి భద్రతలపై వార్షిక నివేదికను సమర్పించిన డీజీపీ మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నప్పటికీ.. కొద్ది శాతం మేరకు నేరాలు పెరిగాయని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తన కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాదికి సంబంధించి శాంతి భద్రతలు, నేరాలపై వార్షిక నిదేదికను డీజీపీ మహేందర్‌రెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శాంతి భద్రతలు, నేరాల పెరుగుదల, ఇతరత్ర రాష్ట్ర పోలీసులు సాధించిన విజయాలను ఆయన విపులంగా వివరించారు. ముఖ్యంగా, రాష్ట్రంలోకి మావోయిస్టులను రానివ్వకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి వలస రాకుండా సరిహద్దుల్లో సాయుధ బలగాలతో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర పోలీసులు 120 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, మరో 32 మంది లొంగిపోయారని ఆయన అన్నారు. మరోవైపు, రాష్ట్రంలో ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు తీసుకున్న చర్యలు ఫలితాన్ని చ్చాయని తెలిపారు. మరోవైపు, ఉగ్రవాదుల కార్యకలాపాలు సాగకుండా రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం తీసుకున్న వ్యూహాత్మక చర్యలు కూడా మంచి ఫలితాలను ఇచ్చాయని డీజీపీ చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్రంలో పలు కీలక కేసులను పరిశోధించడంలో సక్సెస్ అయ్యామని డీజీపీ తెలిపారు. అయితే సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కడం వలన ఆ నేరలు 57 శాతం పెరిగాయని, అలాగే వైట్ కాలర్ నేరాలు 35 శాతం పెరిగాయని ఆయన అన్నారు. దీంతో రాష్ట్రంలో గతేడాది కంటే ఈ సంవత్సరం 4.44 శాతం నేరాలు పెరిగాయని అన్నారు.
ముఖ్యంగా హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తి కోసం హత్యలు వంటి నేరాలు తగ్గుముఖం పట్టాయనీ.. అయితే దారి దోపిడీలు, బర్గ్లరీలు, దొంగతనాలు కొంత శాతం పెరిగాయని తెలిపారు. లైంగిక నేరాలు తగ్గినప్పటికీ మహిళల కిడ్నాప్‌లు, ఇతర నేరాలు మహిళలకు సంబంధించి 18 శాతం పెరిగాయని ఆయన వివరించారు. సైబర్ నేరాలు, వైట్‌కాలర్ నేరాలు కొంత పెరిగినా వాటి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డయల్ 100కు మంచి ఫలితాలు వస్తున్నాయనీ, ముఖ్యంగా దీనికి కాల్ చేసిన బాధితుల వద్దకు పోలీసులు ఏడు నిమిషాలలో చేరుకుని వారి సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది శాంతి భద్రతల పరంగా పలు సవాళ్లు ఎదరైనప్పటికీ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిస్థితులను అదుపు చేశారని డీజీపీ చెప్పారు. పోలీసు స్టేషన్‌కు బాధితుడు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసి తన సమస్యకు పరిష్కారాన్ని సాధించేలా చేయడమే తమ లక్ష్యంగా ఆయన వివరించారు.
నేరగాళ్ల ఏరివేతకు టెక్నాలజీని వాడటం వలన మంచి ఫలితాలను సాధించామనీ, ఇందులో సీసీ టీవీలు, వేలి ముదల్ర విభాగాలు ఫోరెన్సిక్ విభాగాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని డీజీపీ వివరించారు. నేరాలను అదుపు చేయడానికి ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సహాయాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, చోరీలు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు, కొంత మేరకు తగ్గాయని రోడ్డు ప్రమాదాలు కొంత మేరకు పెరిగాయనీ, మాదక పదార్థాల కేసులు కొంత తగ్గాయని డీజీపీ తెలిపారు. ఫ్రీ ఎఫ్ఐఆర్లు విరివిగా నమోదు చేస్తున్నామని ఆయన అన్నారు. డయల్ 100కు ఈ ఏడాది 13.77 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయనీ, ప్రతి కాల్‌కు వెంటనే స్పందించేందుకు వీలుగా గస్తీ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌లలో ఐదు నిమిషాలు, గ్రామీణ ప్రాంతాలలో పది నిమిషాలు, మారు మూల గ్రామాలలో 12 నిమిషాలలో పోలీసులు చేరుకునేలా చర్యలు తీసుకున్నామనీ, మొత్తంమీద ఏడు నిమిషాలలో బాధితులను చేరేలా తాము తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయని తెలిపారు. శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయని అందులో భాగంగా ఈ ఏడాది 56 శాతం కన్విక్షన్ రేటు వచ్చేలా చూశామనీ, గతేడాది కంటే ఇది ఆరు శాతం పెరిగిందని తెలిపారు. అలాగే 152 కేసులలో నేరస్తులకు జీవిత ఖైదు పడేలా చేశామనీ, వచ్చే ఏడాది శిక్షల రేటును పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ ఏడాది నేరగాళ్ల నుంచి చోరీ సొత్తు రికవరీ రికార్డు స్థాయిలో జరిగిందని అన్నారు. మహిళల భద్రతకు సంబంధించి షీటీమ్ బృందాలు పని చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నాయని తెలిపారు. 10 లక్షలకు పైగా నేరగాళ్ల వివరాలు, వేలి ముద్రలు తమ వద్ద ఉన్నాయనీ, వీటి ఆధారంగా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా నేరస్తుల ఆచూకిని కనిపెట్టడంలో రాష్ట్ర పోలీసు కృషి ఫలిస్తున్నదని ఆయన చెప్పారు.
ఈ ఏడాది 431 మంది నేరగాళ్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించామని తెలిపారు. గడిచిన ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం వలన పోలీసు శాఖ మరింత బలోపేతమైందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కమాండ్ కంట్రోల్ ను ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి విపత్తు వచ్చినా ఎదరర్కోగలమని చెప్పారు. రాష్ట్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వలన అనేక నేరాలను అరికట్టడమే గాక పలు కేసుల్లో నేరాలు నిరూపించడానికి అవసరమైన సాక్షాలను సేకరించగలిగామని తెలిపారు. తన పోలీసు సర్వీసులో ప్రజల సహకారంతోటే తాను విజయాలను సాధించగలిగానని తెలిపారు. రాష్ట్రంలో ప్రయివేటు ఆయుధాలు రాకుండ నిలువరించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యానని చెప్పారు.
దిశ కేసులో పోలీసులకు సంబంధించి విచారణ కమిటి చేసిన వ్యాఖ్యలపై తాను ఈ సమయంలో ఏమీ మాట్లాడననీ, ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులే కాదు ఎవ్వరు వ్యవహరించినా చర్యలు తప్పవని డీజీపీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపి జితేందర్, నగర కమిషనర్ సీవీ ఆనంద్, ఐపీఎస్ అధికారులు విజయ్‌కుమార్, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్ తదతరులు హాజరయ్యారు.