Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఏసీబీ పగ్గాలు రవి గుప్తాకు
- హోం శాఖ సెక్రెటరీగా జితేందర్
- సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈయనతో పాటు మరికొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అంజనీ కుమార్‌ను కీలకమైన రాష్ట్ర డీజీపీ పోస్టులో ప్రభుత్వం నియమించింది. ఈయన 1990వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇదే బ్యాచ్‌కు చెందని మరో సీనియర్ ఐపీఎస్ అధకారి, రాష్ట్ర హౌం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ రవి గుప్తాకు ఏసీబీ పగ్గాలను అప్పగిస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు. అలాగే, 1992వ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్‌కు రాష్ట్ర హౌం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాధ్యతలను అప్పగించారు. ఇక దాదాపు ఆరేండ్లుగా రాచకొండ పోలీసు కమిషనర్‌గా కొనసాగుతున్న అదనపు డీజీ మహేశ్ భగవత్‌ను రాష్ట్ర సీఐడీ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. నగర అదనపు పోలీసు కమిషనర్ దేవేందర్‌సింగ్ చౌహాన్‌కు రాచకొండ పోలీసు కమిషనర్ పగ్గాలను అప్పగించారు. రాష్ట్ర ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీ సంజరుకుమార్ జైన్‌ను రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీతో పాటు అదనంగా రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర డీజీపీగా నియమితులైన అంజనీకుమార్ ఈనెల 31న ప్రస్తుత డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేశాక డీజీపీగా నూతన బాధ్యతలను స్వీకరించనున్నారు.
సమర్ధుడు, చిత్తశుధ్ధిగల ఐపీఎస్ అధికారిగా పేరు పొందిన అంజనీ కుమార్.. గతంలో నిజామాబాద్ రేంజ్ డీఐజీగా, రాష్ట్ర పోలీసుట్రైనింగ్ విభాగం ఐజీ, రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేగాక, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీగా, హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్‌గా, అనంతరం పోలీసు కమిషనర్‌గా కీలకమైనబాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో పలు నూతన కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు మూడేండ్ల పాటు నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అంజనీకుమార్.. డీజీపీ హౌదాకు పదోన్నతి పొందాక రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తన పని తాను చేసుకుపోతూ, వివాదాలకు దూరంగా ఉండే అంజనీ కుమార్.. ప్రజలతో పోలీసులు ఎప్పుడూ మమేకం కావాలని కోరుతూ ఆ దిశగా చర్యలు చేపడుతుంటారు. ఈ సందర్భంగా 'నవతెలంగాణ'తో ఆయన మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి డీజీపీగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టను మరింతగా ఇనుమడింప చేయడానికి కృషి చేస్తానని అన్నారు.